మా పార్టీకి తగిన గుర్తే లభించింది: కమల్‌హాసన్

విలక్షణ నటుడు.. మక్కల్‌ నీది మయ్యం అధినేత కమల్‌హాసన్ పార్టీకి ఎన్నికల కమిషన్‌ టార్చ్‌లైట్‌ను పార్టీ గుర్తుగా కేటాయించింది. ఈ సందర్భంగా కమల్‌ ఈసీకి ట్విటర్‌ వేదికగా ధన్యవాదాలు తెలిపారు. ‘మాకు టార్చ్‌లైట్‌ను పార్టీ గుర్తుగా కేటాయించినందుకు ఈసీకి ధన్యవాదాలు. మా పార్టీకి తగిన గుర్తే లభించింది. తమిళనాడులో, భారతీయ రాజకీయ చరిత్రలో మక్కల్‌ నీది మయ్యం టార్చ్‌ బేరర్‌గా మారబోతోంది’ అని పేర్కొన్నారు. 2018 ఫిబ్రవరి 21న కమల్‌ హాసన్‌ పార్టీని స్థాపించారు. త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో కమల్‌ హాసన్‌ పోటీ చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగుతానని కమల్‌ గతంలో ప్రకటించారు. అన్ని స్థానాల్లో ఒంటరిగానే పోటీ చేస్తున్నామని, స్వచ్ఛమైన చేతులతో ప్రజలకు సుపరిపాలన అందించేందుకు కృషి చేస్తామని ఆయన వెల్లడించారు. అవినీతి పార్టీలతో ఎట్టి పరిస్థితుల్లోనూ చేతులు కలపబోమని స్పష్టంచేశారు. డీఎంకేతో తెగదెంపులు చేసుకుంటే కాంగ్రెస్‌ పార్టీతో చేతులు కలపడానికి సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు.