19 ఏళ్ల తరువాత మరోసారి!

సినీ రంగ దిగ్గజాలు కమల్‌ హాసన్‌, ఏ.ఆర్‌ రెహమాన్‌లు దాదాపు 19 ఏళ్ల తర్వాత మరోసారి కలిసి పనిచేయబోతున్నారు. ఒకరు నటన పరంగా, మరొకరు సంగీతం పరంగా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. కమల్‌ నటించిన ‘భారతీయుడు’, ‘తెనాలి’ చిత్రాలకు రెహమాన్‌ సంగీతం అందించారు. ఇప్పుడు తాజాగా కమల్‌ నటిస్తున్న ‘తలైవన్‌ ఇరుక్కిండ్రాన్‌’ అనే చిత్రానికి రెహమాన్‌ సంగీతం అందించనున్నారు. ఈ విషయాన్ని కమల్‌హాసన్‌ ట్విటర్‌ వేదికగా ప్రకటించారు.

‘నీ భాగస్వామ్యంతో చిత్రబృందానికి మరింత బలాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు రెహమాన్‌. మనం స్క్రిప్ట్‌ను ఎంత డెవలప్‌ చేసినా కొన్ని సినిమాలు మాత్రమే సరైన సంతృప్తినిస్తాయి. వాటిలో ‘తలైవన్‌ ఇరుక్కిండ్రాన్‌’ ఒకటి. ఈ సినిమా కోసం మీరు చూపుతున్న ఎగ్జైట్‌మెంట్‌ను మిగిలిన చిత్రబృందానికి కూడా పంచుతాను’ అని పేర్కొన్నారు. ‘తలైవన్‌ ఇరుక్కిండ్రాన్‌’ రాజకీయ నేపథ్యంలో తెరకెక్కుతోంది. చాలా ఏళ్ల క్రితం మొదలైన ఈ సినిమా కొన్ని కారణాల వల్ల మధ్యలోనే ఆగిపోయింది. రెహమాన్‌ రాకతో మళ్లీ చిత్రీకరణను ప్రారంభించారు. లైకా ప్రొడక్షన్స్‌, రాజ్‌కమల్‌ ఫిలింస్‌ ఇంటర్నేషనల్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

CLICK HERE!! For the aha Latest Updates