భయపెడుతున్న ‘కాంచన 3’ ట్రైలర్‌


ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకుడు, నటుడు రాఘవా లారెన్స్‌ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘కాంచన 3’. ఈ సినిమాకు ఆయనే దర్శకత్వం వహించారు. కాగా.. సినిమా ట్రైలర్‌ను తాజాగా రాఘవ ట్విటర్‌ వేదికగా విడుదల చేశారు. భయంకరమైన ఇల్లు, అందులోని దెయ్యాల సన్నివేశాలతో ట్రైలర్‌ మొదలైంది. ఈ సినిమాలో రాఘవ తెల్ల జుట్టు, గెడ్డంతో స్టైలిష్‌గా కనిపిస్తున్నారు. విలన్‌ రాఘవను బెదిరిస్తూ.. ‘నువ్వు నా మాస్‌ తెలీకుండా మాట్లాడుతున్నావ్’ అంటే.. ఇందుకు రాఘవ.. ‘నువ్వు మాసైతే నేను డబుల్‌ మాస్’ అని చెబుతున్న డైలాగ్‌ హైలైట్‌గా నిలిచింది. ‘ముని’ సిరీస్‌ నుంచి 2007లో ‘ముని’ చిత్రం వచ్చింది. ఆ తర్వాత సీక్వెల్‌గా ‘కాంచన’ సినిమాను తెరకెక్కించారు. అనంతరం ‘కాంచన 2’ గా ‘గంగ’ వచ్చింది. ఈ సిరీస్‌ నుంచి వస్తున్న ప్రతి సినిమాలో రాఘవ, కోవై సరళ పాత్రలు తప్ప ఇతర తారాగణం మారుతూ వస్తోంది. ఈ చిత్రంలోనూ రాఘవ తల్లి పాత్రలో కోవై సరళ నటించారు. ‘కాంచన 3’కి తమన్‌ సంగీతం అందించారు. ఓవియా, వేదిక రాఘవకు జోడీగా నటించారు. మనోబాల, దేవదర్శిని, సత్యరాజ్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఏప్రిల్‌ 19న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.