కంగన చీర ట్వీట్‌పై నెటిజన్లు ఆగ్రహం

సాధరణంగా స్టార్స్‌ ధరించే దుస్తుల పట్ల అభిమానుల్లో విపరీతమైన క్రేజ్‌ ఉంటుంది. అందుకే వారు బయటికొచ్చినప్పుడు కళ్లు చెదిరే ఖరీదైన దుస్తుల్లోనే కనిపిస్తుంటారు. తాజాగా బాలీవుడ్‌ ఫైర్‌ బ్రాండ్‌ కంగనా రనౌత్‌ ధరించిన ఓ చీర గురించి ఇంటర్నెట్‌లో చర్చ ప్రారంభమయ్యింది. ఎందుకంటే కంగనా కట్టుకుంది కేవలం రూ.600 విలువ చేసే ఓ చేనేత చీర కావడం ఇక్కడ విశేషం. ఈ క్రమంలో కంగనా సోదరి రంగోలి ‘ఈ చీరను కంగన కోల్‌కతాలో రూ.600కు కొన్నది. అంత తక్కువకే ఇంత మంచి చీరలు దొరుకుతాయని తెలిసి తను చాలా ఆశ్చర్యపోయింది. అయితే ఈ చీరలను నేసేవారు అంత తక్కువ సంపాదన కోసం ఎంత శ్రమిస్తారో అర్థమై తను చాలా బాధపడింది’ అంటూ ట్వీట్‌ చేసింది. దాంతో పాటు ఓ ఫోటోను కూడా షేర్‌ చేసింది.

అయితే రంగోలి ట్వీట్‌పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘ఆమె ధరించిన చీర ఖరీదు రూ.600 సరే బాగానే ఉంది. మరి ఆమె చేతిలో పట్టుకున్న ప్రాడా హ్యాండ్‌ బ్యాగ్‌ 2-3లక్షల రూపాయల ఖరీదు చేస్తుంది. సన్‌ గ్లాసెస్‌, చెప్పులు అన్నింటి విలువ లక్షల్లోనే ఉంటుంది. మీరు మాత్రం కేవలం చీర గురించే గొప్పగా చెప్తున్నారు. ఏది ఏమైనా మీ ప్రచారం కూడా చాలా అమూల్యమైనదే’ అంటూ నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు.