దేవదాస్‌కు కౌశల్ ఆర్మీ గండం!

నాగార్జున నానీ కలిసినటించిన మల్టీ స్టారర్ మూవీ ‘దేవదాస్’ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అందుకే ఈమూవీని ప్రముఖ బాలీవుడ్ నిర్మాణసంస్థ వయాకామ్ 18 అత్యంత భారీమొత్తానికి కొన్నట్లు వార్తలొచ్చాయి. ఈసంస్థ సినిమాను తెలుగురాష్ట్రాల్లో వివిధ ఏరియాలకు భారీ ధరలకు అమ్మి సొమ్ముచేసుకునే ప్రయత్నాల్లో ఉందట. అయితే అదే సమయంలో బుల్లితెరపై నాని హోస్ట్‌గా వ్యవహరిస్తున్న తెలుగు రియాల్టీ షో ‘బిగ్ బాస్ 2’ లోని పరిణామాలు ‘దేవదాస్’ సినిమాకు శాపంగా మారాయని తెలుస్తోంది. వచ్చే వారం విడుదలకు సన్నాహాలు చేస్తున్న ఈ సినిమాపై నెగిటివ్ టాక్ వార్తలు వస్తున్నాయి.

బిగ్‌ బాస్‌-2 సీజన్లో కౌశల్ విజేత అని ఇప్పటికే అతడి అభిమానులు ఓ నిర్ణయానికి వచ్చిన సంగతి తెలిసిందే. దీనికి అనుగుణంగా విపరీతమైన ప్రచారాన్ని కూడా చేస్తున్నారు. ఈక్రమంలో కౌశల్ ను సపోర్ట్ చేయడానికి అతడి అభిమానులు ఎవరినైనా పావులా వాడుకుంటున్నారు. గత ఆదివారం కౌశల్ ను టార్గెట్ చేస్తూ నాని కామెంట్స్ చేయడంతో నెగెటివిటీ అంతా నాని మీదకి డైవర్ట్‌ అవుతోంది. హీరో నానీని అభిమానించే మహిళలు సైతం నానీని విమర్శిస్తున్నారట. ఇక సోషల్‌ మీడియాలో అయితే నానీకి వచ్చే నెగిటివ్ కామెంట్స్ తుఫాన్‌ తలపిస్తోంది. వచ్చే వారం విడుదల కాబోతున్న ‘దేవదాస్‌’ టీమ్‌కి బిగ్‌బాస్‌ వల్ల టెన్షన్‌ పట్టుకుంది. నానినే కాకుండా నాగార్జునను కూడా ట్యాగ్‌ చేస్తూ వైజయంతి మూవీస్‌ పైనా కలిపి ఈ సినిమాని మేము చూడబోమంటూ నాని వ్యతిరేకులు ట్వీట్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా ఈచిత్రాన్ని పైరసీ చేస్తామని ఫేస్‌ బుక్‌ లో వీడియోలు పెడతామని హెచ్చరిస్తున్నట్లు తెలుస్తోంది. ‘బిగ్‌ బాస్-2‌’ ఫైనల్‌కి ముందు రాబోతున్న ఈ చిత్రానికి ఈపబ్లిక్‌ ఎమోషన్‌ వల్ల ఎలాంటి నష్టం జరుగుతుందోననే ‘దేవదాస్’ టీమ్ తో పాటు బయ్యర్లు సైతం ఆందోళన చెందుతున్నారట.

చిత్రంలోని అంశాలు: 2 మంది వ్యక్తులు, వచనం