జగన్‌ కేసీఆర్‌ల భేటీ.. కాళేశ్వరం ప్రారంభోత్సవానికి జగన్‌కు ఆహ్వానం

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ ముగిసింది. సుమారు గంటన్నరకు పైగా కొనసాగిన ఈ భేటీలో అపరిష్కృతంగా ఉన్న విభజన సమస్యల పరిష్కారంపై ఇద్దరు సీఎంలూ చర్చించారు. విభజన చట్టంలోని 9, 10 షెడ్యూళ్లలోని ప్రభుత్వరంగ సంస్థల విభజనపై దృష్టి పెట్టారు. అలాగే, విద్యుత్‌ ఉద్యోగుల విభజన, విద్యుత్‌ బకాయిల పరిష్కారంపైనా చర్చలు జరిపారు. ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాలపైనా సమాలోచనలు జరిపారు. విభజన చట్టంలోని పెండింగ్‌లో ఉన్న అన్ని అంశాలపైనా సానుకూల వాతావరణంలో ఇద్దరు సీఎంలు చర్చించినట్టు సమాచారం. అంతకముందు అమరావతి పరిధిలోని తాడేపల్లిలో తన నివాసానికి విచ్చేసిన కేసీఆర్‌, కేటీఆర్ సహా టీఆర్‌ఎస్‌ ముఖ్య నేతలకు సీఎం జగన్‌ సాదర స్వాగతం పలికారు. ఈ నెల 21న కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి రావాలని కేసీఆర్‌ జగన్‌ను ఆహ్వానించారు. అనంతరం ఇరువురు ముఖ్యమంత్రులు మధ్యాహ్న భోజనం ఆరగించారు. ఆ తర్వాత జరిగిన కీలక భేటీలో ఇరు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ ఆస్తుల పంపకాలు, జల వివాదాలు తదితర ముఖ్య అంశాలపై చర్చించినట్టు సమాచారం.

కృష్ణా, గోదావరి జలాల విషయంలో కోర్టులకు, ట్రైబ్యునళ్లకు వెళ్లేందుకు ఆస్కారం లేకుండా అన్ని సమస్యలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకుందామని ఇరువురు నేతలు ఈ భేటీలో నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈ నెల 24న ఇరు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శుల సమావేశం హైదరాబాద్‌లో ఉంది. ఈ భేటీలో జలవివాదాల విషయంలో ఎలా ముందుకెళ్లాలనే దానిపై చర్చించనున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి జగన్‌ను కేసీఆర్‌ ఆహ్వానించారు. ఈ మేరకు ఆయన స్వయంగా ఆహ్వాన పత్రికను ఏపీ సీఎంకు అందజేశారు. తన నివాసానికి విచ్చేసిన కేసీఆర్‌, కేటీఆర్‌కు జగన్‌ శాలువాలతో సత్కరించి.. వారికి జ్ఞాపికలను అందజేశారు. అనంతరం కేసీఆర్‌, జగన్‌ కలిసి శ్రీ గణపతి సచ్చిదానందస్వామిఆశ్రమానికి ఒకే కారులో బయల్దేరి వెళ్లారు. అక్కడ విశాఖ శ్రీ శారదాపీఠ ఉత్తరాధికారి శిష్య తురియాశ్రమ స్వీకార మహోత్సవంలో పాల్గొన్న అనంతరం కేసీఆర్‌ తిరిగి హైదరాబాద్‌కు పయనం కానున్నారు.