ఎవరితో నటించాలో నాన్నే నిర్ణయిస్తారంటున్న శ్రీదేవి చిన్న కూతురు

అలనాటి నటి శ్రీదేవి చిన్న కుమార్తె ఖుషి కపూర్ తన తొలి సినిమాలో ఎవరు నటించాలో నాన్నే నిర్ణయిస్తారని అంటున్నారు. ఖుషి సోదరి జాన్వి సినిమా రంగంలోకి అడుగుపెట్టేశారు. కరణ్‌ జోహార్ సాయంతో ‘ధడక్‌’ చిత్రంతో తొలి విజయాన్ని ఖాతాలో వేసుకున్నారు. ఇక అందరి చూపు ఖుషి అరంగేట్రంపైనే ఉంది. ఈ విషయం గురించి ఖుషి.. ‘బీఎఫ్‌ఎఫ్‌’ అనే చాట్‌ షోలో మాట్లాడారు.

‘అక్కలాగే నాకూ కరణ్‌ జోహార్‌ సినిమాతో బాలీవుడ్‌లో అడుగుపెట్టాలని ఉంది. కానీ ఈ విషయంలో నాన్న నాకు కర్ఫ్యూ విధించారు. కరణ్‌ జోహార్‌ ఏం చెబితే అది గుడ్డిగా ఫాలో అయిపోతాను. కానీ నా తొలి సినిమాలో నేను ఎవరితో నటించాలన్నది మాత్రం నాన్నే నిర్ణయిస్తారు. ఇప్పటికీ నాన్న నా విషయంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. ఓసారి ఆయన నా స్నేహితురాలికి మెసేజ్‌ చేసి.. ‘బేటా.. నువ్వు ఖుషితో కలిసి ఓ ఫొటో దిగి పంపవా…’ అని అడిగారు’ అని వెల్లడించారు ఖుషి.
నటనలో శిక్షణ తీసుకోవడానికి ఖుషి త్వరలో న్యూయార్క్‌ వెళ్లబోతున్నారు. తిరిగి వచ్చాక కరణ్‌ జోహార్‌ నిర్మించబోయే చిత్రంతో ఆమె బాలీవుడ్‌లోకి అడుగుపెడతారని తెలుస్తోంది. ఇక జాన్వి విషయానికొస్తే.. ప్రస్తుతం ఆమె మూడు సినిమాలతో బిజీగా ఉన్నారు. ఐఏఎఫ్‌ తొలి మహిళా పైలట్‌ గుంజన్‌ సక్సేనా బయోపిక్‌తో పాటు.. ‘తఖ్త్‌’, ‘రూహ్‌ అఫ్జా’ చిత్రాల్లో నటిస్తున్నారు.