‘ఎన్టీఆర్‌’తో క్రిష్‌

‘ఎన్టీఆర్‌’ బయోపిక్‌ ‘మహా నటుడు’, ‘నాయకుడు’ జీవితాన్ని తెరపై చూపించే బాధ్యత క్రిష్‌ తన భుజలపై వేసుకున్నాడు. ‘ఎన్టీఆర్‌’ జీవితం తెరపై చూపించడం అంత తేలికైన విషయం కాదు. ఎన్నో కోణాలు, ఇంకెన్నో పార్శ్వాలు స్పృశించాలి. లెక్కలేనన్ని పాత్రల్ని కథలో భాగం చేయాలి. సినిమా, రాజకీయాలు రెండింటికీ సమ ప్రాధాన్యం ఇస్తూ – ఎన్టీఆర్‌ అభిమానుల మనసు నొప్పించకుండా, చరిత్ర వక్రీకరించకుండా ‘ఎన్టీఆర్‌’ జీవితాన్ని తెరపై చూపించాలి. పైగా… ఒకేసారి రెండు భాగాలు. అంటే కష్టం రెట్టింపు అన్నమాట. కృషితో నాస్తి దుర్భిక్షం అంటారు కదా. ఇక్కడ క్రిష్‌ కూడా అదే కృషిని నమ్ముకున్నారు. అనుకున్న సమయానికే రెండు భాగాల్ని పూర్తి చేయడానికి అహర్నిశలూ కష్టపడుతున్నారు. ఎన్టీఆర్‌ సినీ జీవితంలో కలికితురాయి… ‘గుండమ్మకథ’ అందులోని బుల్లోడు – బుల్లెమ్మ మధ్య నడిచిన సన్నివేశాలైతే.. ఎవర్‌గ్రీన్‌గా నిలిచాయి. ‘లేచింది మహిళా లోకం’ పాట ఎన్ని తరాలైనా గుర్తుంటుంది. ‘గుండమ్మ కథ’ చెబుతూ ఆ పాట లేకపోతే ఎలా? అందుకే సావిత్రిలా నిత్యమేనన్‌ని రంగంలోకి దింపారు క్రిష్‌. దానికి సంబంధించిన సన్నివేశమే ఇది. క్రిష్‌ సన్నివేశం వివరిస్తుంటే బాలయ్య కూడా ‘అదీ.. అలానే చేయాలి..’ అంటూ నిత్యకి సూచనలిస్తున్నారు. ఈ సన్నివేశాన్ని ‘ఎన్టీఆర్‌ – కథానాయకుడు’లో చూడొచ్చు.

ఎన్టీఆర్‌లోని రెండో కోణం.. ఆయనలోని ప్రజా నాయకుడు. బయోపిక్‌లో రెండో భాగం పూర్తిగా రాజకీయాలకు సంబంధించినదే. ఎన్టీఆర్‌ ప్రసంగాలు, వేదికపై ఆయన హావభావాలను అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేరు. ఇక్కడ కూడా బాలయ్యతో ఓ వాడి వేడి రాజకీయ ప్రసంగం చేయించబోతున్నారు దర్శకుడు క్రిష్‌. ‘నా తెలుగింటి ఆడపడుచులకు..’ అంటూ ఎన్టీఆర్‌ని గుర్తుకు తెచ్చే సన్నివేశంలో బాలయ్యని ఇలా నిమగ్నం చేస్తున్నారు. ‘మహా నాయకుడు’ లో ఈ సన్నివేశాన్ని చూడొచ్చు. ఈ రెండు చిత్రాలూ సంక్రాంతికి విడుదల అవుతున్నాయి. శనివారం క్రిష్‌ పుట్టినరోజు. ఆయన దర్శకత్వం వహించిన బాలీవుడ్‌ చిత్రం ‘మణికర్ణిక’ త్వరలోనే విడుదల కానుంది.