తెలంగాణలో స్వతంత్రులదే గెలుపు: లగడపాటి

తెలంగాణలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో రాబోయే ఫలితాలపై మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ జోస్యం చెప్పారు. తెలంగాణలో 8 నుంచి 10 మంది ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలవబోతున్నారని సంచలన ప్రకటన చేశారు. శుక్రవారం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. తెలంగాణ ఎన్నికలపై తన సర్వే కొనసాగుతోందని, రోజుకు ఇద్దరి చొప్పున ఎవరు గెలిచే అవకాశముందో వెల్లడిస్తానని అన్నారు.

తెలంగాణలో ఏ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుందో ఇప్పుడే చెప్పలేనని, డిసెంబర్ 7న పోలింగ్ ముగిసిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తానని తెలిపారు. సర్వేల విషయంలో ఆక్టోపస్‌గా పేరున్న లగడపాటి తెలంగాణలో హంగ్ వచ్చే పరిస్థితి లేదని మాత్రం స్పష్టం చేశారు. మహబూబ్‌నగర్ జిల్లా నారాయణపేటలో బీఎల్‌ఎఫ్ అభ్యర్థి శివకుమార్‌రెడ్డి గెలవబోతున్నారని.. అలాగే ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గం ఇండిపెండెంట్ అభ్యర్థి అనిల్ జాదవ్ కూడా గెలవబోతున్నట్లు లగడపాడి వెల్లడించారు.

తెలంగాణ ఎన్నికల్లో ప్రజల నాడి కోసం ఈ ఏడాది ఆగస్ట్ నెల నుంచి సర్వే చేస్తున్నామని, అనేక పర్యాయాలు అధ్యయనం చేశామని, మరో వారం పాటు సర్వే కొనసాగుతుందని ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో లగడపాటి తెలిపారు. తెలంగాణ ప్రజలు ఈసారి ఎలాంటి ప్రలోభాలకు లోనుకాకుండా ఓటు వేయబోతున్నట్లు, ఇండిపెండెంట్లను గెలిపించబోతున్నట్లు తెలిపారు. తెలంగాణలో హంగ్ ఏర్పడే అవకాశం లేదని, ఏ పార్టీ గెలిచినా పూర్తి మెజారిటీతోనే ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశముందని తెలిపారు.