వర్మ’లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ కు ఈసీ అనుమతి.. వెల్లడించిన నిర్మాత

‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ మూవీ విడుదలకు ఈసీ అంగీకరించిందని ఆ చిత్ర నిర్మాత రాకేశ్‌రెడ్డి తెలిపారు. ముందుగా అనుకున్నట్లే సినిమాను ఈ నెల 29న విడుదల చేస్తున్నామని చెప్పారు. సినిమాలో కొన్ని సన్నివేశాలు ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘిచేలా ఉన్నాయని వచ్చిన ఫిర్యాదుపై సినిమాను పరిశీలిచేందుకు మీడియా సర్టిఫికేషన్‌ అండ్‌ మానిటరింగ్‌ కమిటీ (ఎంసీఎంసీ) ముందు హాజరు కావాలని ఈసీ ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆ చిత్ర నిర్మాత రాకేశ్‌రెడ్డి సోమవారం హాజరయ్యారు. అనంతరం రాకేశ్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. సినిమాపై ఎన్నికల సంఘానికి అన్ని అంశాలు వివరించామని తెలిపారు. మా సమాధానంపై ఎన్నికల సంఘం సంతృప్తి చెందిందన్నారు. సినిమా విడుదలకు అంగీకారం తెలిపిందని చెప్పారు. విడుదల తర్వాత ఏమైనా అభ్యంతరాలు ఉంటే మళ్లీ హాజరు కావాలని తెలిపిందని వివరించారు. చిత్రంలో ఎవరి మనోభావాలూ దెబ్బతీయలేదని మరోసారి ఈసీకి వివరించామన్నారు. ఎన్టీఆర్ జీవితంలోని ఓ భాగాన్ని తమ సినిమాలో చూపించామన్నారు. లక్ష్మీపార్వతి రాసిన పుస్తకం ఆధారంగానే సినిమా తీశామని, ఆనాడు జరిగిన సంఘటనలను మాత్రమే సినిమాలో చూపించామని రాకేశ్‌రెడ్డి వివరించారు. జగన్ తమ పార్టీ అధినాయకుడు మాత్రమేనని, ఆయనతో తనకు బంధుత్వం లేదని స్పష్టం చేశారు.