నమ్రత పై మహేష్‌ బాబు ప్రశంసలు

సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు.. పిల్లలు గౌతమ్‌, సితారల విషయంలో తన సతీమణి నమ్రత శిరోద్కర్‌ చాలా కఠినంగా ఉంటారని అంటున్నారు. ‘మహర్షి’ విజయం సాధించిన నేపథ్యంలో కటుంబంతో కలిసి విహారయాత్రలను ఎంజాయ్‌ చేసొచ్చిన మహేష్‌ తన 26వ చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రీకరణలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓ ఆంగ్ల మీడియాతో ముచ్చటించారు.

‘నమ్రత పిల్లల విషయంలోనే కాదు నా విషయంలోనూ కఠినంగా ఉంటుంది. అది మంచికే అనుకోవాలి. ఎందుకంటే నేను పిల్లల్ని చాలా గారాబం చేస్తాను. నా గారాబం వారిపై ఎలాంటి ప్రభావం చూపకుండా నమ్రత జాగ్రత్తపడుతూ ఉంటుంది. నా పిల్లలు ఎంత ఎదిగిన ఒదిగి ఉండేలా అది దోహదపడుతుంది. ఎంత ఒత్తిడిలో ఉన్నా నా కుటుంబమే నన్ను ఉపశమన పరుస్తుంది. కేవలం సినిమా విడుదల రోజునే కాదు. నాకు కంగారు కలిగించే ఏ విషయంలోనైనా నా భార్య, పిల్లలు నన్ను ప్రశాంతంగా ఉంచేందుకు ప్రయత్నిస్తారు’ అని వెల్లడించారు మహేష్‌‌.

‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రానికి అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. రష్మిక మందన హీరోయిన్‌. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. ప్రముఖ నటి విజయశాంతి ఈ సినిమాతో తన సెకెండ్‌ ఇన్నింగ్స్‌ని మొదలుపెడుతున్నారు. 2020 సంక్రాంతికి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.