రివ్యూ: మరకతమణి

నటీనటులు: ఆదిపినిశెట్టి, నిక్కిగ‌ర్లాని, కొటాశ్రీనివాస‌రావు, ఆనంద్ రాజ్‌, అరుణ్ రాజ్‌, రామ్‌దాస్ త‌దిత‌రులు
సంగీతం: దిబు నైన‌న్ థామ‌స్‌
సినిమాటోగ్రాఫ‌ర్‌: పి.వి.శంక‌ర్‌
ఎడిట‌ర్‌: ప్ర‌స‌న్న.జి.కె
నిర్మాతలు: రిషి మీడియా, శ్రీ చ‌క్ర ఇన్నోవేష‌న్స్‌
క‌థ‌,స్క్రీన్‌ప్లే,ద‌ర్శ‌క‌త్వం: A.R.K.శ‌ర్వ‌న‌ణ్
డిఫరెంట్ కథలను ఎన్నుకుంటూ యంగ్ హీరోస్ లో తనకంటూ ఓ స్పెషల్ క్రేజ్ తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు హీరో ఆది పినిశెట్టి. తను ఎన్నుకున్న మరో కొత్త కథ ‘మరకతమణి’. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఆడియన్స్ ను ఎంతవరకు మెప్పించిందో.. సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం!

కథ:
రఘునందన్(ఆదిపినిశెట్టి) స్మగ్లింగ్ చేసి డబ్బు సంపాదించాలనుకుంటాడు. అదే సమయంలో మరకతమణిని తీసుకొస్తే పది కోట్ల డబ్బు వస్తుందని తెలుసుకున్న రఘు దానికి అంగీకరిస్తాడు. పురాతన కాలానికి చెందిన మరకతమణిని దక్కించుకోవాలని చాలా మంది ప్రయత్నించారు. అలా ప్రయత్నించిన అందరినీ ఓ గుర్తు తెలియని వాహనం చంపేస్తూ ఉంటుంది. అలా 132 మంది వరకు చనిపోతారు. ఈ విషయం తెలుసుకున్న రఘు ఓ స్వామీజీ సలహా మేరకు ఆత్మ సహాయం తీసుకుంటాడు. ఆ ఆత్మ మరో ముగ్గురు ఆత్మలను తీసుకొస్తుంది. అందరూ కలిసి మణి కోసం వెతుకుతుంటారు. అయితే అదే ప్రాంతానికి చెందిన ట్వింకిల్ రామానుదం(ఆనంద్ రాజ్) అనే రౌడీ కూడా ఆ మరకతమణిని దక్కించుకోవాలనుకుంటాడు. మరి చివరకు ఆ మరకతమణి ఎవరి దగ్గరకు చేరింది..? దాని కారణంగానే ప్రాణ నష్టం ఏమైనా జరిగిందా..? అసలు ఆ మణి వెనుక ఉన్న రహస్యాలు ఏంటి..? మణి కోసం ప్రయత్నిస్తున్న వారిని చంపుతుంది ఎవరు..? అనే విషయాలు తెరపై చూడాల్సిందే!

ప్లస్ పాయింట్స్:
కథ, కథనం
కామెడీ
నటీనటుల పెర్ఫార్మన్స్
మైనస్ పాయింట్స్:
తెలుగు నేటివిటీకి దూరంగా ఉండడం
కొన్ని సాగతీత సన్నివేశాలు

విశ్లేషణ:
హారర్, కామెడీకి ఫాంటసీ జోడించి సినిమా చేశారు. దర్శకుడు రాసుకున్న కథ, కథనాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. ఇంత తక్కువ బడ్జెట్ తో ఓ మంచి ఎంటర్టైనింగ్ సినిమా చేయొచ్చని ప్రూవ్ చేశారు. సినిమా మొదటి భాగం కాస్త స్లో గా ఉన్నప్పటికీ.. కథలోకి ఆత్మలు ఎంటర్ అయిన దగ్గర నుండి ఊపందుకుంది. సెకండ్ హాఫ్, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సన్నివేశాలు మరింత ఎంటర్టైన్ చేస్తాయి. సినిమాలో ప్రతి పాత్రను దర్శకుడు డిజైన్ చేసిన తీరుని మెచ్చుకోవాల్సిందే.

కథకు ఆది పినిశెట్టి పూర్తి న్యాయం చేశాడు. ఇప్పటివరకు సీరియస్ సినిమాలు చేసిన ఆది తొలిసారి కామెడీ సినిమాలో నటించాడు. నిక్కి గల్రాని పాత్ర ప్రేక్షకులను బాగా నవ్విస్తుంది. తెలంగాణ యాసలో మగ గొంతుతో మాట్లాడే ఆ పాత్ర సినిమాకు హైలైట్ అయింది. డబ్బింగ్ కూడా బాగా కుదిరింది. రామ్ దాస్, అరుణ్ రాజ్ లు తమ నటనతో నవ్విస్తారు. విలన్ ఆనంద్ రాజ్ పాత్రను కొత్తగా డిజైన్ చేసినప్పటికీ క్లైమాక్స్ సన్నివేశాల్లో మాత్రం ఆ పాత్ర తేలిపోయింది.

అయితే తమిళ నేటివిటీ ఎక్కువ కావడం వలన ఆడియన్స్ కాస్త ఇబ్బంది పడే అవకాశం ఉంది. కానీ కథకు కనెక్ట్ అయితే మాత్రం ఆ లోటు కూడా అనిపించదు. టెక్నికల్ గా సినిమా స్థాయి ఆకట్టుకుంటుంది. సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది. నేపధ్య సంగీతం సినిమాలో ప్రతి సన్నివేశాన్ని ఎలివేట్ చేసింది. మొదటి భాగంలో కొన్ని సన్నివేశాలను ఎడిట్ చేసి ఉంటే సినిమా ఇంకా బావుండేది. మొత్తానికి ఓ మంచి సినిమా చూశామనే ఫీలింగ్ ఆడియన్స్
కు తప్పకుండా కలుగుతుంది.
రేటింగ్: 3/5