సీఎం జగన్‌ను కలిసిన చిరంజీవి దంపతులు


ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని మెగాస్టార్‌ చిరంజీవి దంపతులు కలిశారు. సోమవారం మధ్యాహ్నం హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడ చేరుకున్న చిరంజీవి, భార్య సురేఖతో కలిసి తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ వారిని సాదరంగా ఆహ్వానించారు. సీఎం జగన్‌కు పుష్పగుచ్ఛం ఇచ్చి చిరంజీవి శాలువా కప్పారు. తాను హీరోగా నటించిన సైరా సినిమా చూడాలని కోరారు. తర్వాత జగన్‌తో కలిసి చిరంజీవి దంపతులు భోజనం చేశారు. జగన్ సతీమణి వైఎస్ భారతి కూడా అక్కడే ఉన్నారు. వైఎస్‌ జగన్‌ సీఎం అయ్యాక చిరంజీతో భేటీ కావడం ఇదే తొలిసారి. ఈనెల 5న తెలంగాణ గవర్నర్‌ తమిళసై సౌందరరాజన్‌ను చిరం‍జీవి మర్యాదపూర్వకంగా కలిసిన సైరా నరసింహారెడ్డి సినిమా చూడాలని ఆమెను కోరారు. చిరంజీవి ఆహ్వానం మేరకు గవర్నర్‌ ప్రత్యేకంగా ఈ సినిమాను వీక్షించారు.