ప్రకంపనలు సృష్టిస్తున్న ‘మీ టూ’ ఉద్యమం

సినీ పరిశ్రమను ‘మీ టూ’ ప్రకంపనలు కుదిపేస్తున్నాయి… లైంగిక వేధింపులకు గురయ్యామంటూ బయటకు వస్తున్న మహిళల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది… మహిళలు మౌనం వీడి తమపై జరిగిన లైంగిక వేధింపులు, లైంగిక దాడులపై సోషల్ మీడియా వేదికగా అంతర్జాతీయంగా ప్రారంభమైన ‘మీ టూ’ ఉద్యమం ఇప్పుడు భారత్‌లోనూ ప్రకంపనలు రేకెత్తిస్తోంది. ఇటీవలే బాలీవుడ్‌ ప్రముఖ నటుడు నానా పటేకర్‌ తన పట్ల అసభ్యంగా ప్రవర్తించారంటూ నటి తనుశ్రీ దత్తా ఆరోపణలతో ఆరంభమైన ‘మీ టూ’ ఉద్యమం… క్రమంగా పెరుగుతూ చిత్ర పరిశ్రమను కుదిపేయసాగింది. మరోవైపు దేశంలోని ప్రముఖ మీడియా సంస్థలను సైతం ఇది ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. తనుశ్రీ ఈ ఉద్యమంలో ముందుడగా… ఇక ‘క్వీన్‌’ సినిమా షూటింగ్‌ సమయంలో ఆ చిత్ర దర్శకుడు తనతో అసభ్యంగా ప్రవర్తించాడంటూ కంగనా రనౌత్‌ కూడా ‘మీ టూ’ ఉద్యమంలో చేరిపోయింది. మరోవైపు టాలీవుడ్‌ సింగర్‌, డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌.. చిన్మయి, నటి ఆషా శైనీ తాము కూడా లైంగిక వేధింపులకు గురయ్యామంటూ వ్యాఖ్యలు చేశారు.


ఇక ప్రముఖ ఆంగ్ల పత్రికలో పని చేసిన ఒక మహిళా ఉద్యోగి తమ పత్రిక పొలిటికల్ ఎడిటర్ తనను లైంగికంగా వేధించాడంటూ వెల్లడించటంతో ఆయన ఉద్యోగానికి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. దీంతో ‘మీ టూ’ ఉద్యమం సినీ పరిశ్రమలతో పాటు… మీడియా సంస్థలను కూడా తాకింది. ఇక వివరాల్లోకి వెళ్తే ‘హార్న్‌ ఓకే ప్లీజ్‌’ చిత్రం షూటింగ్‌ సమయంలో నానా పటేకర్‌ తనను లైంగికంగా వేధించాడంటూ తనుశ్రీ కొద్ది రోజుల క్రితం వెల్లడించడం పెద్ద దుమారాన్నే రేపాయి. దీంతో బాలీవుడ్‌ ప్రముఖుల్లో కొందరు తనుశ్రీకి మద్దతుగా, కొందరు నానాకు మద్దతుగా వ్యాఖ్యానాలు చేయటం మొదలుపెట్టారు. తమకు ఎదురైన లైంగిక వేధింపులకు సంబంధించిన వివరాలను సోషల్ మీడియా వేదికగా బయటపెడుతూ మొదలైన ‘మీ టూ’ ఉద్యమం ఇప్పుడు సినీ పరిశ్రమలోనే కాదు, కొన్ని మీడియా సంస్థలనూ కుదిపేసే స్థాయికి చేరింది. ఈ ఉద్యమంలో భాగస్వాములై కొందరు నటులు బాహాటంగా, మరికొందరు సోషల్ మీడియా ద్వారా ఈ తాలుకు చేదు అనుభవాలను బయటపెడుతున్నారు.

ఇక ఈ వ్యవహారంలో కంగనను నమ్మలేమంటూ సోనమ్‌ కపూర్‌ చేసిన వ్యాఖ్యలు మరింత హీట్ పెంచాయి. తనుశ్రీ తనపై చేసిన ఆరోపణలను నానాపటేకర్‌ తోసిపుచ్చారు. మరోవైపు ఆ చిత్ర నిర్మాత సమీ సిద్దిఖీ కూడా నానా పటేకర్‌కు మద్దతుగా నిలవగా… తనుశ్రీ చెబుతున్నట్టు షూటింగ్‌ సమయంలో ఎలాంటి వేధింపులు జరగలేదంటూ దర్శకుడు రాకేష్‌ సారంగ్‌ చెప్పుకొచ్చారు. కంగనా ఆరోపణలపై ఓ కార్యక్రమంలో స్పందించిన సోనమ్‌… కంగనా చాలా విషయాలు చెబుతుంటారు. ప్రతి దాన్ని సీరియస్‌గా తీసుకోలేం. అక్కడ ఏం జరిగిందో నాకూ తెలియదు. తనకు జరిగిన అన్యాయాన్ని కంగనా ధైర్యంగా చెప్పడం అభినందనీయమే. అది నిజమైతే వేధింపులకు పాల్పడినవాళ్లు శిక్ష అనుభవిస్తారు అంటూ వ్యాఖ్యానించడంపై కంగనా రనౌత్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

లైగింక వేధింపులకు గురైన బాధితులందరిలాగే నాకు జరిగిన అన్యాయాన్నీ చెప్పుకున్నా… తప్పో.. ఒప్పో నిర్ణయించడానికి ఆమె ఎవరు? ఇలాంటి వాళ్లకు నా గురించి మాట్లాడే హక్కు ఎవరిచ్చారంటూ బాలీవుడ్‌ క్వీన్ కంగనా ఫైర్ అయ్యింది. మరోవైపు ఆరోపణలు ఎదుర్కొంటున్నవారు వాటిని తోసిపుచ్చుతుండగా… బాలీవుడ్ ప్రముఖులు దోషులకు శిక్షలు పడాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. ఈ వ్యవహారంపై స్పందించిన హృతిక్‌ రోషన్‌ ఇది రహస్యంగా దాచాల్సిన విషయం కాదు. వేధింపుల విషయంలో దోషులుగా తేలినవారందరికీ శిక్షలు పడాలని… బాధితులకు నిర్భయంగా మాట్లాడగలిగే శక్తినివ్వాలని ట్వీట్‌ చేశారు. మరోవైపు ఈ పరిణామాలపై స్పందించిన కేంద్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి మనేకా గాంధీ.. మన దేశంలోనూ మీ టూ ఉద్యమం ప్రారంభమైంది, లైంగిక వేధింపులపై అనేక మంది మహిళలు ధైర్యంగా మాట్లాడటం చాలా సంతోషకరమైన విషయమన్నారు. ఇప్పటిఏ సినీపరిశ్రమ, మీడియా సంస్థలను కుదిపేస్తోన్న ‘మీ టూ’ ఇంకా ఎటువైపు వెళ్తుందో చూడాలి మరి.