కోలీవుడ్ ఎంట్రీ ఇప్పట్లో కాదు!

అక్కినేని నాగచైతన్య నటించిన ‘రా రండోయ్ వేడుక చూద్దాం’ సినిమాతో తన కెరీర్ లోనే మంచి ఓపెనింగ్స్ సాధించాడు. తెలుగులో ఇప్పుడిప్పుడే తన మార్కెట్ పరిధిని పెంచుకునే పనిలో పడ్డాడు. నిలకడగా హిట్స్ ను కూడా అందుకుంటున్నాడు. ఇలాంటి సమయంలో మరో భాష మీద ఫోకస్ పెట్టి తన కెరీర్ గ్రాఫ్ ను కన్ఫ్యూజన్ లో పెట్టడం ఇష్టంలేని చైతు కోలీవుడ్ లో ఇప్పట్లో సినిమా చేయనని ప్రకటించేశాడు. వాస్తవానికి ఈ ఏడాదిలోనే చైతు కోలీవుడ్ ఎంట్రీ జరగాలి. ప్రేమమ్ సినిమా టైమ్ లో 2017లో ఓ తమిళ సినిమా చేస్తానని చెప్పాడు చైతు.
కానీ ఇప్పుడు రారండోయ్ వేడుక చూద్దాం సినిమా సక్సెస్ తో తన నిర్ణయం మార్చుకున్నాడు. ముందుగా టాలీవుడ్ లో తన పరిధిని పెంచుకొని ఆ తరువాత తమిళ సినిమా గురించి ఆలోచిస్తే మంచిదని చైతు భావిస్తున్నాడు. కాబట్టి చైతు కోలీవుడ్ ఎంట్రీ ఇప్పట్లో జరిగేలా లేదు. ప్రస్తుతం ఈ యంగ్ హీరో చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. కృష్ణ మరిముత్తు దర్శకత్వంలో సినిమా యాభై శాతం షూటింగ్ పూర్తిచేశాడు. త్వరలోనే చందు మొండేటి సినిమా మొదలుపెట్టనున్నాడు. ఈ రెండు సినిమాలను కూడా ఈ ఏడాదే పూర్తి చేయాలనుకుంటున్నాడు.