చైతూ-సామ్‌ల ‘మజిలీ’ ఫస్ట్‌లుక్‌

టాలీవుడ్‌లో చూడముచ్చటైన జంట నాగచైతన్య, సమంత కలిసి నటించిన సినిమా ‘మజిలీ’. ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ ఫస్ట్‌లుక్‌ను ఈరోజు విడుదల చేశారు. ‘ఇది నాకెంతో ప్రత్యేకమైన చిత్రం అని చెప్పడానికి చాలా కారణాలున్నాయి. చై, సామ్‌ జంటగా నటిస్తున్న నాలుగో చిత్రమిది. కొత్త ఏడాదిని ఈ చిత్రంలో ఆరంభిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అందరికీ ఆడ్వాన్స్‌ న్యూఇయర్‌ శుభాకాంక్షలు. శివ నిర్వాణతో కలిసి పనిచేయడం నా కల. ఏప్రిల్‌లో కలుస్తాం’ అని చైతూ పేర్కొంటూ లుక్‌ను షేర్‌ చేశారు.

లుక్‌లో చై, సామ్‌ ఒకరినొకరు ఆప్యాయంగా పట్టుకున్నట్లుగా కన్పించారు. బ్యాక్‌గ్రౌండ్‌లో వాల్తేరు గ్రౌండ్స్‌, విశాఖపట్నం అని రాసుంది. సమంత, నాగచైతన్య నటిస్తున్న తొలి చిత్రం కావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో సమంత రైల్వే క్లర్క్‌ పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఓ మధ్య తరగతి కుటుంబానికి చెందిన భార్యాభర్తల మధ్య వచ్చే చిన్నపాటి తగాదాలు, ప్రేమనురాగాల నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతోందట. షైన్‌ స్క్రీన్స్‌ బ్యానర్‌పై సాహు గరపాటి, హరీశ్‌ పెద్ది ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాని 2019 వేసవి కానుకగా ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.