అందుకు నన్ను క్షమించండి: నాగచైతన్య

అక్కినేని యంగ్‌ హీరో నాగచైతన్య కథానాయకుడిగా నటించిన చిత్రం ‘శైలజా రెడ్డి అల్లుడు’. ఈ చిత్రం వినాయక చవితి సందర్భంగా విడుదలైంది. మారుతి దర్శకత్వం వహించిన ఈ చిత్రం మూడు రోజుల్లోనే రూ.25 కోట్ల వసూళ్లు రాబట్టింది. చైతూ కెరీర్‌లో తొలివారం అత్యధిక కలెక్షన్స్‌ రాబట్టిన చిత్రంగా నిలిచింది. ఈ సందర్భంగా శనివారం నిర్వహించిన సక్సెస్‌ మీట్‌లో తన సినిమా గురించి చైతూ మీడియాతో మాట్లాడారు.

‘సినిమా విజయం సాధించినందుకు చాలా సంతోషంగా ఉంది. కానీ కొందరు సమీక్షకులను నా సినిమాతో సంతృప్తి పరచలేకపోయాను. అందుకు నన్ను క్షమించండి. ఇక నుంచి కష్టపడి పనిచేస్తానని మాటిస్తున్నాను. సినిమా చూసిన వాళ్లలో అమ్మాయిల నుంచే ఎక్కువగా ప్రశంసలు వస్తున్నాయి’ అని వెల్లడించారు చైతూ. ఈ చిత్రంలో చైతూకు జోడీగా అను ఇమ్మాన్యుయేల్‌ నటించారు. ప్రముఖ నటి రమ్యకృష్ణ అత్త శైలజారెడ్డి పాత్ర పోషించారు. మరోపక్క చైతూ తన తదుపరి చిత్రం ‘సవ్యసాచి’ తో బిజీగా ఉన్నారు. చందూ మొండేటి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్‌ నటి నిధి అగర్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు.