పెళ్లిపై పెదవి విప్పిన నగ్మ

ప్రముఖ నటి నగ్మ తన పెళ్లి గురించి ఎట్టకేలకు నోరువిప్పారు. ఒకప్పుడు చిత్ర పరిశ్రమలో హీరోయిన్‌గా ఒక వెలుగు వెలిగిన నగ్మ.. ఆ తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఆమె ఇప్పటివరకు పెళ్లి చేసుకోలేదు. కొందరు నటులతో ఆమె డేటింగ్‌ చేసినట్లు గతంలో వార్తలు కూడా వచ్చాయి. కానీ వాటిపై నగ్మ ఎప్పుడూ స్పందించింది లేదు. ఈ నేపథ్యంలో ఓ కార్యక్రమంలో నగ్మ తన వివాహం గురించి స్పందించారు. తనకు దాంపత్య జీవితంపై నమ్మకం ఉందని.. సరైన సమయం వచ్చినప్పుడు తప్పకుండా పెళ్లి చేసుకుంటానని తెలిపారు. ప్రస్తుతం తన జీవితంలో ఎవ్వరూ లేరని స్పష్టం చేశారు. సరైన వ్యక్తి దొరికినప్పుడు అందరి సమక్షంలో వివాహమాడతానని పేర్కొన్నారు.

మాజీ క్రికెటర్‌ సౌరవ్‌ గంగూలీతో నగ్మ డేటింగ్‌లో ఉన్నారని గతంలో వార్తలు వెలువడ్డాయి. ఈ విషయం గురించి అప్పట్లో నగ్మ నిజమేనని స్పష్టం చేశారు. 2001లో తాను సౌరవ్‌ ప్రేమించుకున్నామని, కానీ తన కారణంగా సౌరవ్‌ కెరీర్‌ పరంగా నష్టపోతారని భావించి తానే తప్పుకొన్నానని తెలిపారు. ‘కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి. నాకు తనకంటే ముఖ్యమైన బాధ్యతలు ఉన్నాయి. తనకూ అంతే..’ అని అప్పట్లో తన రిలేషన్‌షిప్‌ గురించి బయటపెట్టారు నగ్మ. తెలుగులో ‘కిల్లర్‌’, ‘ఘరానా మొగుడు’, ‘మేజర్‌ చంద్రకాంత్‌’, ‘బాషా’, ‘కొండపల్లి రాజా’ తదితర చిత్రాల్లో నటించి నగ్మ మంచి పేరు తెచ్చుకున్నారు. ఆమె చివరిసారిగా 2007లో వచ్చిన ‘తూ హమారా హో’ అనే భోజ్‌పురి చిత్రంలో నటించారు. ఆ తర్వాత రాజకీయాలతో బిజీ అయిపోవడంతో సినిమాలకు దూరంగా ఉన్నారు.