అది సినిమానా.. అసలు భరించలేకపోయా.. ‘సూపర్‌ డీలక్స్’ పై సినిమాటోగ్రాఫర్‌ సంచలన వ్యాఖ్యలు

ప్రముఖ నటి సమంత నటించిన ‘సూపర్‌ డీలక్స్’ చిత్రంపై ప్రముఖ తమిళ సినిమాటోగ్రాఫర్‌ నటరాజన్‌ సుబ్రహ్మణ్యం కామెంట్‌ చేశారు. త్యాగరాజన్‌ కుమారరాజా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విజయ్‌ సేతుపతి హిజ్రా పాత్రలో, రమ్యకృష్ణ వేశ్య పాత్రల్లో నటించారు. గత వారం విడుదలైన ఈ సినిమా మంచి టాక్‌ అందుకుంది. అయితే ఈ సినిమా గురించి నటరాజన్‌ ట్విటర్‌ వేదికగా స్పందిస్తూ.. ‘నిజ జీవితంలో ఇలాంటి అసహ్యమైన అంశాలను ప్రోత్సహించడం, అభినందించడం కరెక్టేనా? ఇలాంటి తక్కువ స్థాయి అంశాలకు నేను దూరంగా ఉంటాను. సూపర్‌ డీలక్స్’.. ఇది సినిమానా.. ఓ గాడ్‌.. అసలు భరించలేకపోయా’ అని పేర్కొన్నారు. దాంతో ఆయన ట్వీట్‌ కాస్తా సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోంది. అభిమానులు మాత్రం నటరాజన్‌ వ్యాఖ్యల పట్ల ఆయన్ను తప్పుబడుతున్నారు. సినిమా నచ్చకపోయినంత మాత్రాన ఇలా నీచంగా కామెంట్‌ చేయకూడదంటూ బుద్ధిచెబుతున్నారు. ఈ విషయంపై సమంత స్పందించలేదు. శృంగారం, లింగ వివక్షత వంటి అంశాల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు.