10-15 నిమిషాల్లో మనిషి చనిపోతాడు.. ’28 డిగ్రీస్’ మూవీ టీజర్‌

‘చనిపోయిన వాళ్లు తిరిగి వస్తారా..?’ అని ప్రశ్నిస్తున్నారు ’28 డిగ్రీస్’ సినిమాలో నటి. నవీన్‌ చంద్ర, వి. షాలినీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ఇది. అనిల్‌ విశ్వనాథన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఎస్‌. సాయి అభిషేక్‌ నిర్మాత. శ్రావణ్‌ భరద్వాజ్‌ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ను శనివారం విడుదల చేశారు. ఇందులో నవీన్‌ చంద్ర అరుదైన ఆరోగ్య సమస్యతో బాధపడుతూ కనిపించారు. ‘మానసికంగా ఎక్కువ ఒత్తిడికి గురికావడం వల్ల బ్రెయిన్‌ దెబ్బతింది. ఇలాంటి సమస్యను నేను ఇంత వరకు ఎప్పుడూ చూడలేదు. చుట్టూ స్థిరమైన ఉష్ణోగ్రతను ఉంచుకోవాలి. లేకపోతే 10-15 నిమిషాల్లో మనిషి చనిపోతాడు’ అని వైద్యుడు వివరించే డైలాగ్‌తో టీజర్‌ ప్రారంభమైంది. ‘చనిపోయిన వాళ్లు తిరిగి వస్తారా..?’ అంటూ ఓ మహిళ ప్రచార చిత్రం చివర్లో ప్రశ్నించారు. క్రైమ్‌ థ్రిల్లర్‌గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలో ఈ సినిమా విడుదల కాబోతోంది.