HomeTelugu Big Storiesనాగశౌర్య వైఖరి మార్చుకోవాల్సిన అవసరముందా?

నాగశౌర్య వైఖరి మార్చుకోవాల్సిన అవసరముందా?

15 10

యువ హీరో నాగశౌర్య వివాదాల్లో చిక్కుకుంటున్నాడు. సొంత బ్యానర్‌లో తన అభిరుచికి తగ్గట్టుగా అశ్వత్థామ సినిమాను తెరకెక్కించి విజయం సాధించాడు. తన తదుపరి ప్రాజెక్టుతో వార్లల్లో ఉండాల్సిన నాగశౌర్య వివాదాలతో మీడియాలో హెడ్‌లైన్‌గా మారాడు. ఒకటి కాదు.. రెండు కాదు వరుస వివాదాలు అతడిని వెంటాడుతున్నాయి. కారణం అతని వైఖరిలో లోపముందా? తనకే అన్నీ తెలుసు అనే భావనలో వెళ్తున్నాడా? అదే అతడిని వివాదాల్లోకి నెట్టుతోందా? ఆలోచించుకోవాల్సిన అవసరముంది.

నాగశౌర్య విషయంలో ప్రతి ఒక్కరితో వివాదాలు జరుగుతూనే ఉన్నాయి. నిర్మాతలు, నటులు, డైరెక్టర్లు, హీరోయిన్లతోనూ వివాదాలు ఏర్పడుతున్నాయి. ఛలో సినిమాతో నాగశౌర్య, వెంకీ కుడుముల ఇద్దరు కలిసి మంచి హిట్‌ను సొంతం చేసుకొన్నారు. దర్శకుడిగా మంచి సినిమాను అందించినందుకు వెంకీ కుడుములకు నాగశౌర్య ఫ్యామిలీ ఓ కారును బహుమతిగా కూడా ఇచ్చింది. ఆ తర్వాత వీరిద్దరి మధ్య అభిప్రాయ బేధాలు వచ్చాయి. చలో దర్శకుడు వెంకీ కుడుములపై నాగశౌర్య ఆరోపణలు చేశాడు. మా అమ్మ గిప్టుగా ఇచ్చిన కారును అమ్మేసుకొని బైక్‌పై తిరుగుతున్నారు అంటూ నాగశౌర్య కామెంట్ చేశాడు. ఈ అంశం మీడియాలో వివాదంగా మారింది. ఇదే విషయంపై దర్శకుడు వెంకీ కుడుముల స్పందిస్తూ నాగశౌర్యపై బహిరంగ ఆరోపణలు చేయలేదు. నాగశౌర్యతో కొంత విభేదాలు ఉన్న విషయం నిజమే. కానీ ఆ విషయాలు బయటకు మాట్లాడుకోవడం అప్రస్తుతం అని సున్నితంగా తిరస్కరించారు. అది ఆ దర్శకుడిలోని సంస్కారం.

తాజాగా మెహ్రీన్‌తో ఓ అంశం మీడియాలో కాంట్రవర్సీగా మారింది. అశ్వత్థామ సినిమా ప్రీ రిలీజ్ వేడుక సందర్భంగా మెహ్రీన్‌ను ఆహ్వానిస్తే.. తనకు అనారోగ్యంగా ఉందని రావడానికి నిరాకరించారట. తప్పనిసరిగా రావాల్సిందేనని బెదిరింపులు చేశారట. ఈ వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. మీడియాలో మంచి పేరున్న నాగశౌర్య ఇలా వివాదాల్లో కూరుకుపోవడం చర్చనీయాంశమవుతోంది.

గతంలో సాయి పల్లవి పైనా నాగశౌర్య వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. సాయిపల్లవి, నాగశౌర్య కలిసి కణం సినిమాలో నటించారు. తనను అత్యంత ఎక్కువగా ఇరిటేట్ చేసిన హీరోయిన్ సాయిపల్లవి అని ఓపెన్‌గా కామెంట్ చేశాడు. కానీ దానిపై సాయి పల్లవి స్పందిస్తూ నేను ఎవరికీ ఇబ్బంది కలిగించకూడదనే, నా వల్ల ఎవరూ ఇబ్బంది పడకూడదనుకుని అనుకుంటాను. నా మనస్తత్వమే అది. నాగశౌర్యను సహ నటుడిగా గౌరవిస్తాను. ఎవరినీ బాధపెట్టకూడదనే అనుకుంటాను. నేను అతడిని ఎలా బాధపెట్టానో నాకు అర్ధం కావడం లేదు అని, అది నన్ను చాలా బాధపెడుతోందని సమాధానమిచ్చింది. అంతేగానీ నాగశౌర్యపై సాయి పల్లవి ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయలేదు.

“మనకు తెలిసింది గోరంత మాత్రమే.. తెలుసుకోవాల్సింది కొండంత” అనుకునే వారు జీవితంలో పైకి వస్తారనేది మన పెద్దల మాట. అంతా మనకే తెలుసు అనుకుంటే అది మనల్ని పాతాళం లోకి పడేస్తుంది. మనం ఎంత నేర్చుకున్నా ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంటుందనేది ఇండస్ట్రీలో ఎంతోమంది సీనియర్ నటులు తమ అనుభవంతో చెప్పిన మాట. నాగశౌర్య ఇతరులపై నిందలు వేయడం కంటే తన కంటే సీనియర్ నటులను ఆదర్శంగా తీసుకుని వివాదాలకు దూరంగా ఉంటూ తన కెరీర్‌పై దృష్టి పెట్టి విజయాలను అందుకోవాలని కోరుకుందాం.

Recent Articles English

Gallery

Recent Articles Telugu