ఆంధ్రప్రదేశ్‌కు కొత్త గవర్నర్ రానున్నారా?


ఆంధ్రప్రదేశ్‌లో తమ పార్టీని బలోపేతం చేయాలని చూస్తున్న బీజేపీ.. ఇందుకోసం గవర్నర్‌ను మార్చనుందని కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో విదేశాంగ మంత్రిగా పని చేసిన సుష్మా స్వరాజ్‌ను ఏపీ గవర్నర్ నియమిస్తారంటూ జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా సుష్మను నియమిస్తున్నారని కేంద్ర మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ ట్వీట్ చేశారని న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ తెలిపింది. బీజేపీ మహిళా నేతకు ఆయన అభినందనలు తెలుపుతున్న ట్వీట్ స్క్రీన్ షాట్‌ను ఏఎన్ఐ పోస్ట్ చేసింది. తర్వాత మంత్రి తన ట్వీట్‌ను తొలగించారన్న ఏఎన్ఐ.. సంబంధిత స్క్రీన్ షాట్‌ను ట్వీట్ చేసింది.

మంత్రి హర్షవర్ధన్ ట్వీ‌ట్‌తో సుష్మా స్వరాజ్‌ను ఏపీ గవర్నర్‌గా పంపడం ఖరారైందని చాలా మంది భావించారు. ఇదే రోజున తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్.. హోం శాఖ మంత్రి అమిత్ షాను కలవడంతో.. ఏపీకి కొత్త గవర్నర్ వార్త ప్రాధాన్యం సంతరించుకుంది. ఏపీ గవర్నర్‌గా తనను నియమిస్తున్నారనే వార్తలపై సుష్మా స్వరాజ్ స్పందించారు. తనను ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా నియమిస్తారని వస్తున్న వార్తల్లో నిజం లేదని తేల్చి చెప్పారు. మరి కొందరేమో ఆమెకు రాష్ట్రపతి పదవి ఆఫర్ చేస్తారని అభిప్రాయపడుతున్నారు. అసలు ఏం జరగనుందనేది మరి కొద్ది రోజుల్లోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.