నైజీరియన్ చేతిలో పోసపోయిన సోనాక్షి వర్మ

నైజీరియన్ చేతిలో నటి సోనాక్షి వర్మ మోస పోయారు. ఫేస్‌బుక్‌లో ఫ్రెండ్ చేసుకుని ఆపై స్నేహం పేరుతో నైజీరియన్‌ వ్యక్తి మోసం చేశాడు. సోనాక్షి ఫేస్‌బుక్ ఖాతాకు మే నెలలో మెర్రిన్ కిర్రాక్ పేరుతో ఓ రిక్వెస్ట్ రావడంతో ఆమె యాక్సెప్ట్ చేశారు. అప్పటి నుంచి వారిద్దరు ఛాటింగ్ చేసుకునేవారు. తాను లండన్‌లో ఉంటున్నానని, మీతో స్నేహం చేయాలని ఉందని చెప్పడంతో సొనాక్షి దగ్గరైంది. కొద్దిరోజుల తర్వాత తమ పరిచయానికి గుర్తుగా ఓ గిఫ్ట్ పంపుతున్నానని, ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ నుంచి నేరుగా హైదరాబాద్‌లోని ఇంటికి వస్తుందని చెప్పడంతో ఆమె నమ్మారు.

మే 27వ తేదీన ఢిల్లీ ఎయిర్‌పోర్టు అధికారినంటూ ఓ వ్యక్తి ఫోన్ చేశాడు. మెర్రిన్ కిర్రాక్ పేరుతో మీకు బహుమతి వచ్చిందని, దాన్ని హైదరాబాద్ పంపాలంటే రూ.85వేలు కట్టాలని చెప్పాడు. అతడి మాటలు నమ్మిన సొనాక్షి అధికారి చెప్పిన బ్యాంక్ ఖాతాలో నగదు డిపాజిట్ చేసింది. వారం రోజులైనా బహుమతి రాకపోవడంతో ఎయిర్‌పోర్ట్ అధికారికి ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ వచ్చింది. దీంతో మోసపోయానని గ్రహించిన సొనాక్షి వర్మ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.