‘ఎన్టీఆర్’ న్యూ లుక్‌.. ఎన్టీఆర్ తో చంద్రబాబు

నందమూరి తారక రామారావు బయోపిక్‌ ‘ఎన్టీఆర్‌‌’ సినిమాను ఎన్‌బీకే ఫిలింస్‌ బ్యానర్‌పై బాలకృష్ణ నిర్మిస్తూ.. నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి క్రిష్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈరోజు వినాయక చవితి పురస్కరించుకుని ‘ఎన్టీఆర్‌‌’ చిత్రబృందం అభిమానులకు మరో సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటివరకు ఎన్టీఆర్‌గా బాలకృష్ణ, ఆయన అల్లుడు, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుగా రానా దగ్గుబాటి ఫస్ట్‌లుక్స్‌ మాత్రమే బయటకి వచ్చాయి. ఈసారి మామా అల్లుళ్లు కలిసే వచ్చారు. పోస్టర్‌లో ఎన్టీఆర్‌.. తన అల్లుడిపై ప్రేమగా చెయ్యివేసి మాట్లాడుతున్నట్లుగా చూపించారు.

ఇదివరకు విడుదలైన లుక్స్‌ కంటే ఈ పోస్టర్‌ అభిమానులను ఎక్కువగా ఆకట్టుకుంటోంది. ఎన్టీఆర్‌ సతీమణి బసవతారకం పాత్రలో బాలీవుడ్‌ నటి విద్యాబాలన్‌ నటిస్తున్నారు. అలనాటి నటుడు అక్కినేని నాగేశ్వరరావు పాత్రలో ఆయన మనవడు సుమంత్‌ నటిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమా విడుదల చేయనున్నారు. తెలుగుతో పాటు తమిళం, హిందీలోనూ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.