‘ఎన్టీఆర్‌ బయోపిక్‌’ ట్రైలర్‌.. ప్రతి పాత్రకు ప్రాణం పోసిన బాలకృష్ణ

నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో రెండు పార్టులుగా తెరకెక్కుతున్న ‘ఎన్టీఆర్‌ బయోపిక్‌’ ట్రైలర్‌ను కాసేపటి క్రితం విడుదలైంది. సినిమాలు, రాజకీయ ప్రస్తానాన్ని కలబోసి రూపొందిన ట్రైలర్ ఆద్యంతం విశేషంగా ఆకట్టుకుంటోంది. డైలాగ్‌‌లు చెప్పడంలో తనకు తానే సాటి అని పలుమార్లు నిరూపించుకున్న బాలకృష్ణ.. మరోసారి ఇందులో అదరగొట్టారు. ఎన్టీఆరే దిగివచ్చారా అన్నట్టుగా ఆహార్యంలో, డైలాగ్‌ డెలివరీలో బాలయ్య ‘జీవించేశారు’.

‘ఆ రామారావు ఏంటి? కృష్ణుడేంటి?.. మార్చండి’ అని ఓ వ్యక్తి అంటే.. ‘రామారావు చక్కగా సరిపోతారండీ. ఆయన కళ్లల్లో ఓ కొంటెతనం ఉంటుంది’ అని మరొకరు చెప్పే డైలాగ్‌తో ట్రైలర్‌ ఆరంభమైంది. ‘నేను ఉద్యోగం మానేశాను..ఎందుకు మానేశావు..నచ్చలేదు..మరేం చేద్దామని..సినిమాల్లోకి వెళతాను..’ అనే డైలాగ్‌తోపాటు ‘జనం కోసమే సినిమా అనుకున్నాను..ఆ జనానికే అడ్డమైతే సినిమా కూడా వద్దంటాను’ అంటూ వచ్చే డైలాగ్స్ ప్రధానాకర్షణగా నిలిచాయి.

‘ధన బలమైతే బలుపులో కనిపిస్తుంది.. కానీ ఇది జన బలం.. ఒక్క పిలుపులో వినిపిస్తుంది’ అనే డైలాగ్‌‌ నందమూరి అభిమానులను బాగా కనెక్ట్‌ అవుతుంది. ’60 ఏళ్లు వస్తున్నాయి.. ఇన్నాళ్లూ మా కోసం బతికాం… ఇక ప్రజల కోసం, ప్రజాసేవలో బతకాలనుకుంటున్నాం’ అని బాలయ్య చెప్పడం ట్రైలర్‌కే హైలైట్‌గా నిలిచింది.