‘యన్‌.టి.ఆర్‌’ అప్‌డేట్స్‌!

ఎన్‌టీఆర్‌ జీవితం ఆధారంగా నందమూరి బాలకృష్ణ టైటిల్‌ రోల్‌ పోషిస్తున్న చిత్రం ‘యన్‌.టి.ఆర్‌’. ఈ సినిమాకి క్రిష్‌ దర్శకత్వం వహిస్తున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమా జనవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో డిసెంబరు16న హైదరాబాద్‌లో ట్రైలర్‌ విడుదల వేడుకను, 21న నిమ్మకూరులో ఆడియో విడుదల కార్యక్రమాన్ని నిర్వహించాలని చిత్ర బృందం భావించింది. కాగా, ఇప్పుడు ట్రైలర్‌, ఆడియో వేడుకను ఒకేసారి నిర్వహించాలని భావిస్తున్నారు. రెండు కార్యక్రమాలు డిసెంబరు 21నే జరగనున్నాయి. ఈ విషయాన్ని వెల్లడిస్తూ, ‘యన్‌.టి.ఆర్‌.’ లోని బాలకృష్ణ సరికొత్త లుక్‌ను చిత్ర బృందం పంచుకుంది. పెద్ద కాలర్‌ కలిగిన తెల్ల చొక్కాను ధరించిన బాలకృష్ణ కళ్లద్దాలు పెట్టుకుని, ప్రొజెక్టర్‌పై చేయి వేసిన నిలబడిన స్టిల్‌ అభిమానులను విశేషంగా అలరిస్తోంది.

రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రం జనవరి 9న ‘కథానాయకుడు’ పేరుతో విడుదల కానుంది. ఎన్టీఆర్‌ సినీ కెరీర్‌ ప్రారంభం నుంచి ముఖ్యమంత్రి అయ్యే వరకూ జరిగిన సంఘటనలకు దీనిలో దృశ్యరూపం ఇవ్వనున్నారు. ఇక సీఎం అయిన దగ్గరి నుంచి ఆయన చనిపోయే వరకూ చోటు చేసుకున్న సంఘటనలను ‘మహానాయకుడు’ పేరుతో జనవరి 25న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.ఎన్‌బీకే ఫిల్మ్స్‌ పతాకంపై నందమూరి బాలకృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వారాహి చలన చిత్రం, విబ్రి మీడియాలు సమర్పిస్తున్నాయి. ఎం.ఎం.కీరవాణి స్వరాలు సమకూరుస్తున్నారు.