రివ్యూ: ఓం నమో వెంకటేశాయ

నటీనటులు: అక్కినేని నాగార్జున, అనుష్క, ప్రగ్య జైస్వాల్, సౌరభ్ జైన్, రావు రమేష్ తదితరులు
సినిమాటోగ్రఫీ: ఎస్.గోపాల్ రెడ్డి
సంగీత: ఎం.ఎం.కీరవాణి
ఎడిటింగ్: గౌతమ్ రాజు
నిర్మాత: మహేష్ రెడ్డి
కథ-కథనం-దర్శకత్వం: కె.రాఘవేంద్రరావు
అక్కినేని నాగార్జున, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు కాంబినేషన్‌లో గతంలో వచ్చిన అన్నమయ్య, శ్రీరామదాసు, శిరిడి సాయి చిత్రాలు ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి. మరోసారి వీరిద్దరు కలిసి చేసిన ప్రయత్నం ‘ఓం నమో వెంకటేశాయ’. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈసినిమా ఎంతవరకు సక్సెస్ అయిందో.. సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం!

కథ:
రామ్(నాగార్జున)కు చిన్నతనం నుండే దేవుణ్ణి చూడాలనే కోరిక. తన గురువును కూడా ఈ విషయమై ప్రశ్నిస్తాడు. ఎప్పటికైనా నువ్వు దేవుడితో కలిసి పాచికలు ఆడతావని గురువు, రామ్ కు చెబుతాడు. అలా దేవుడి కోసం తపస్సు చేస్తాడు రామ్. అతడి తపస్సును మెచ్చి బాలుడి
రూపంలో దర్శనం ఇస్తాడు స్వామి(సౌరభ్ జైన్). తనకోసం స్వామి స్వయంగా వచ్చాడని తెలుసుకోలేని రామ్ తన తపస్సుకు భంగం కలిగించిన కోపం అక్కడ నుండి స్వామిని వెళ్లిపో అంటాడు. ఆ తరువాత ఇంటికి తిరిగి వెళ్ళిపోయిన రామ్ కు తన మరదలు భవాని(ప్రగ్యజైస్వాల్) ను ఇచ్చి పెళ్లి చేయాలని అనుకుంటారు. కానీ రామ్ తన జీవితం స్వామి వారికోసమే అని తిరుమల బయలుదేరతాడు. అక్కడ రామ్ కు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి. తాను ఆశించినట్లుగా దేవుణ్ణి చూడగలిగాడా..? స్వామితో కలిసి పాచికలు ఆడాడా..? రామ్ కు హథీరాం బాబాజీగా పేరు ఎలా వచ్చింది..? అనుష్క పాత్ర ఎలా ఉండబోతుంది అనే విషయాలు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే!

విశ్లేషణ:
అన్నమయ్య, శ్రీరామదాసు వంటి పూర్తి భక్తిరస చిత్రాలను రూపొందించిన రాఘవేంద్రరావు మరోసారి నాగార్జునతో కలిసి వేంకటేశ్వరస్వామి గురించి సినిమా చేశారు. స్వామి వారికి పరమ భక్తిడైన హథీరాం బాబాకు, స్వామికి మధ్య జరిగే సన్నివేశాలే ఈ సినిమా. కథ చుట్టూ.. కొన్ని అనవసరపు సన్నివేశాలను, గ్లామర్ కోసమే రెండు పాటలను చిత్రీకరించినట్లుగా అనిపిస్తుంది. అయితే స్వామివారికి, హథీరాంకు మధ్య వచ్చే సన్నివేశాలను, సంబాషణలను మాత్రం ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే విధంగా చిత్రీకరించడం దర్శకుడు సక్సెస్ అయ్యాడు. ఇద్దరూ కలిసి పాచికలు ఆడే సన్నివేశాలు సినిమాకు హైలైట్ గా నిలిచాయి.

నాగార్జున నిజమైన భక్తుడిగా అధ్బుతంగా నటించాడు. సినిమాలో అతడి లుక్ శ్రీరామదాసు సినిమాను గుర్తు చేసింది. అనుష్క.. కృష్ణమ్మ అనే పరమ భక్తురాలిగా ఒదిగిపోయింది. ప్రగ్యజైస్వాల్ ను కేవలం గ్లామర్ కోసమే తీసుకున్నారని అర్ధం అవుతోంది. సౌరభ్ జైన్ స్వామి వారి పాత్రలో ఒదిగిపోయాడు. ఇప్పటికే తను పలు హిందీ సీరియల్స్ లో శ్రీకృష్ణుడిగా నటించి మెప్పించాడు. అదే అనుభవంతో చేసిన వేంకటేశ్వరస్వామి రోల్ మరోసారి తనకు మంచి పేరు తెచ్చిపెడుతుందనడంలో సందేహం లేదు. రావు రమేష్ పాత్ర డిజైన్ చేసిన తీరు శ్రీరామదాసులో కొన్ని సన్నివేశాలను తలపిస్తుంది. జగపతిబాబు కేవలం ఒక పాటకు మాత్రమే పరిమితం అయ్యారు.

నిర్మాణ పరంగా సినిమాను ఎక్కడ రాజీ పడకుండా చిత్రీకరించారు. సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంటుంది. ప్రతి ఫ్రేమ్ రిచ్ గా కనిపిస్తుంది. లొకేషన్స్ చాలా అందంగా ఉన్నాయి. గ్రాఫిక్స్ అనే ఫీలింగ్ ఎక్కడా కలగదు. కీరవాణి సంగీతం గురించి చెప్పనక్కర్లేదు. ప్రతి పాట అధ్బుతం. సినిమా మొదటి భాగంలో కొన్ని సన్నివేశాలను ఎడిట్ చేస్తే ఇంకా బావుండేది. స్థల పురాణం గురించి, ఓ భక్తుడి పట్ల స్వామి వారికి ఉన్న ప్రేమ గురించి సినిమాలో బాగానే చూపించారు. అయితే ఇది యూత్ కు ఎంత వరకు కనెక్ట్ అవుతుందో.. డౌటే.. ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రం ఈ సినిమాకు కనెక్ట్ అవుతారు. భక్తి చిత్రాలను ఇష్టపడే ప్రతి ప్రేక్షకుడికి సినిమా నచ్చుతుంది.
రేటింగ్: 3/5