ఎన్నికల్లో ఓటమిపై పవన్ కల్యాణ్ ఏమన్నారంటే..!


సాధారణ ఎన్నికల తర్వాత కొంత విరామం తీసుకున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇవాళ మంగళగిరిలో పార్టీ నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పవన్‌ మాట్లాడుతూ.. ఇటీవల జరిగిన అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి తమకు ఓ అనుభవమని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌అన్నారు. ఓటమిని ఓటమిగా కాకుండా ఓ అనుభవంగా తీసుకుంటామని తెలిపారు. నాలుగేళ్ల జనసేన పార్టీకి లక్షలాది మంది ఓటు వేయడాన్ని తాము ఓ విజయంగానే భావిస్తున్నామని అన్నారు. జనసేన పార్టీని ఎదగనీయకుండా కొన్ని బలమైన శక్తులు పనిచేయడంతోనే వ్యతిరేక ఫలితాలు చూడాల్సి వచ్చిందని పవన్ అన్నారు.

జనసేన పార్టీకి బలీయమైన క్యాడర్‌ ఉందని ఈ ఎన్నికల్లో నిరూపితమైందన్నారు. ఓటమికి వ్యక్తులను కారణంగా చూపరాదని.. పార్టీకి జనబలం ఉందని, ఆ బలాన్ని పార్టీ కోసం వినియోగించుకోవడమే ప్రస్తుతం తమ ముందున్న కర్తవ్యమని నేతలకు సూచించారు. తుదిశ్వాస ఉన్నంత వరకు పార్టీని ముందుకు తీసుకెళ్తూనే ఉంటానని పవన్ స్పష్టంచేశారు. ఒక్కోసారి ఊహించని ఫలితాలు చూడాల్సి ఉంటుందని, అలాంటి వాటిని ఎదుర్కోవాలంటే దీర్ఘకాలిక ప్రణాళిక, ముందుచూపు అవసరమన్నారు. గాజువాక, భీమవరం రెండు చోట్లా తాను పోటీ చేసినప్పటికీ సమయాభావంవల్ల ఏ నియోజకవర్గంలోనూ పూర్తిస్థాయిలో ఓటర్లను కలుసుకోలేకపోయానని చెప్పారు.

త్వరలో కొత్త రాజకీయ వ్యవహారాల కమిటీని నియమిస్తామని పవన్‌ కల్యామ్ తెలిపారు. ప్రస్తుత కమిటీ కాల పరిమితి ముగిసిందని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మరో కమిటీని నియమిస్తామని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రణాళికలు, అభ్యర్థుల ఎంపిక వంటివాటిపై దృష్టి పెడతామన్నారు. పార్టీ భావజాలం, నిర్ణయాలు, ప్రణాళికలను కార్యకర్తలు, ప్రజలకు ఎప్పటికప్పుడు తెలియజేసేందుకు ఓ పక్షపత్రిక తీసుకురావాలని పవన్‌ నిర్ణయించారు. ఈ పత్రికలో రాష్ట్ర, దేశ, విదేశాలకు చెందిన పాలసీలు, నిర్ణయాలు, అభివృద్ధి రంగాలకు చెందిన సమాచారాన్ని పొందుపరుస్తామన్నారు. పత్రిక తొలి ప్రతిని సెప్టెంబర్‌లో విడుదల చేయనున్నట్టు పవన్‌ తెలిపారు.