దేవరకొండ ‘టాక్సీవాలా’ కు ప్రభాస్‌ విషెస్!

యంగ్‌ హీరో విజయ్‌ దేవరకొండకు స్టార్‌ హీరో యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ అభినందనలు తెలిపారు. విజయ్‌ హీరోగా నటించిన తాజా చిత్రం ‘టాక్సీవాలా’. ఈ సినిమాకి రాహుల్‌ దర్శకత్వం వహించారు. ప్రియాంక జవాల్కర్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. యూవీ క్రియేషన్స్‌, జీఏ2 సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. జేక్స్‌ బెజాయ్‌ సంగీతం అందించారు. నవంబరు17న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా ప్రభాస్‌ ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశారు. ‘రేపు ‘టాక్సీవాలా’ విడుదల కాబోతున్న నేపథ్యంలో విజయ్‌ దేవరకొండకు, మొత్తం చిత్ర బృందానికి బెస్ట్‌ విషెస్‌. సినిమాను థియేటర్లలో మాత్రమే చూడండి. పైరసీని ప్రోత్సహించకండి’ అని ప్రభాస్‌ పేర్కొన్నారు.

ప్రస్తుతం ప్రభాస్‌ ‘సాహో’ సినిమాలో నటిస్తున్నారు. సుజీత్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో శ్రద్ధా కపూర్‌ కథానాయికగా కనిపించనున్నారు. యూవీ క్రియేషన్స్‌ సంస్థ భారీ బడ్జెట్‌తో దీన్ని నిర్మిస్తోంది. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మరోపక్క ప్రభాస్‌.. రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న సినిమాలోనూ నటిస్తున్నారు. పూజా హెగ్డే కథానాయిక. ప్రేమ కథాంశంతో దీన్ని రూపొందిస్తున్నారు.