బ్రహ్మాస్త్ర సెట్స్‌లో రామ్‌నాథ్‌ కోవింద్

భారత రాష్ట్రపతి రామ్‌ నాథ్‌ కోవింద్‌ ప్రస్తుతం మూడు దేశాల పర్యటనలో భాగంగా బల్గేరియాలో ఉన్నారు. ఈ సందర్భంగా బల్గేరియాలో షూటింగ్‌ జరుపుకుంటున్న బాలీవుడ్‌ మూవీ ‘బ్రహ్మాస్త్ర’ టీమ్‌ను ఆయన కలుసుకున్నారు. అధికారులు ఇందుకు సంబంధించిన ఫోటోలను రాష్ట్రపతి అధికారిక ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. ఈ చిత్రంలో అమితాబ్ బ‌చ్చన్‌, నాగార్జున అక్కినేని, రణ్‌బీర్‌ కపూర్, అలియా భట్, మౌనీరాయ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్‌లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రాని కరణ్‌జోహార్ నిర్మిస్తున్నారు. అయాన్ ముఖ‌ర్జీ తెర‌కెక్కిస్తున్నఈ ‘బ్రహ్మాస్త్ర’ చ్రితం ప్రస్తుతం బ‌ల్గేరియాలో షూటింగ్ జ‌రుపుకుంటుంది.

మూడు దేశాల పర్యటనలో ఉన్న రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్ ప్రస్తుతం బ‌ల్గేరియాలో ఉన్నారు. బ్రహ్మాస్త్ర చిత్ర షూటింగ్ బ‌ల్గేరియాలో జ‌రుగుతుంద‌ని తెలుసుకున్న రాష్ట్ర‌ప‌తి.. బ‌ల్గేరియా ప్రెసిడెంట్ రాదేవ్‌తో క‌లిసి బ్రహ్మాస్త్ర సెట్స్‌ని సంద‌ర్శించారు. వీరితో పాటు రామ్‌నాథ్‌ కోవింద్‌ భార్య రుమాన్‌ దేవి కూడా ఉన్నారు. ఈ సందర్భంగా రామ్‌ నాథ్‌ బ్రహ్మాస్త్ర నటీనటులంద‌రితో మాట్లాడారు. బ్ర‌హ్మాస్త్ర షూటింగ్ జ‌రుగుతున్న సోషియా స్టూడియోని సంద‌ర్శించారు.

ఇరు దేశాల ప్రెసిడెంట్స్‌ న‌టీన‌టుల‌తో క‌లిసి ఫోటోలు దిగారు. ఆ ఫోటోల‌ని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా త‌మ అఫీషియ‌ల్ ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేసింది. సినిమా అనేది రెండు దేశాల మ‌ధ్య బిజినెస్‌, క‌ల్చ‌ర‌ల్ లింక్ అవుతుంద‌ని ఇరుదేశాల అధ్యక్షులు ఆశాభావం వ్య‌క్తం చేసిన‌ట్టు రాష్ట్ర‌ప‌తి కార్యాల‌యం త‌మ ట్విట్ట‌ర్‌లో పేర్కొంది. వచ్చే ఏడాది ఈ ‘బ్రహ్మాస్త్ర’ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.