ప్రముఖ సినీ నిర్మాత నారా జయశ్రీ మృతి

చిరంజీవి, అర్జున్‌, కృష్ణ లాంటి స్టార్‌ హీరోలతో పలు చిత్రాలను నిర్మించిన నిర్మాత నారా జయశ్రీ దేవి కన్నుమూశారు. బుధవారం ఉదయం హైదరాబాద్‌లోని నివాసం‍లో ఉండగా గుండెపోటు రావటంతో ఆమెను దగ్గరలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అయినా ఫలితం లేకపోయిందని ఆమె పెంపుడు కుమారుడు వాసు తెలిపారు. జయశ్రీ దేవికి భర్త, కుమార్తె ఉన్నారు. తొలుత పాత్రికేయురాలిగా కెరీర్‌ ప్రారంభించిన జయశ్రీ, తరువాత సినిమాల పట్ల ఆసక్తితో నిర్మాణవ్యవహారాలు చూసేవారు.

కన్నడ పరిశ్రమలో దాదాపు 25 చిత్రాలు నిర్మించారు. తెలుగులో చిరంజీవితో మంజునాథ, కృష్ణతో చంద్రవంశం, ఆదిశంకరాచార్య చిత్రాలు నిర్మించారు. కన్నడలో నిశ్శబ్ద, నమ్ముర మందార హువే, హబ్బా, అమృతవర్షిణి, ముకుందా మురారి వంటి చిత్రాలు రూపొందించారు. తాజాగా భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ‘కురుక్షేత్ర’ సినిమా నిర్మాణం చేస్తున్నారు. జయశ్రీదేవి అంత్యక్రియలు బెంగళూరులో నిర్వహించనున్నారు.