బిగ్‌బాస్‌కు ఎదురు తిరిగిన పునర్నవి

తెలుగు బిగ్‌బాస్-3 రియాలిటీ షో 50 ఎపిసోడ్‌లు పూర్తయిన తర్వాత హౌస్‌లో అసలైన ఆట ఇప్పుడు మొదలైంది. ప్రస్తుతానికి టైటిల్‌ రేసులో 11 మంది నువ్వా నేనా అంటూ పోటీ పడుతుండటంతో.. ఇంత వరకూ సాఫీగా సాగిన ఆట ఇప్పుడు క్రిటికల్‌గా మారింది. ఎలిమినేషన్‌తో పాటు టాస్క్‌లు కూడా టఫ్‌గా మారడంతో కంటెస్టెంట్స్ ఒక్కొక్కరుగా బర్న్ అవుతున్నారు. డైరెక్ట్‌గా బిగ్ బాస్‌పైనే ఎదురు తిరుగుతున్నారు. బిగ్‌బాస్ నీ టాస్క్ నువ్వే ఆడుకో.. నీ చెత్త గేమ్‌లకు ఓ దండం అంటూ పునర్నవి లాంటి కంటెస్టెంట్స్ బర్న్ అవుతుంటే.. ఇదే దారిలో మహేష్ విట్టా కూడా బిగ్ బాస్ నిర్ణయాలను తప్పుపడుతున్నాడు.

ఈ వారం లగ్జరీ బడ్జెట్‌లో భాగంగా.. ‘ఇంట్లో దెయ్యం నాకేం భయం’ అనే టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఇందులో ఇంటి సభ్యులు బాబా భాస్కర్, హిమజ, రాహుల్, శిల్ప, వితికాలు దెయ్యాలుగా మారి ఇంటి సభ్యులైన రవి, పునర్నవి, వరుణ్, శివజ్యోతి, శ్రీముఖి, మహేష్‌లను వేధిస్తూ వాళ్లకి ఇచ్చిన సీక్రెట్ టాస్క్‌లను కంప్లీట్ చేశారు. గేమ్‌లో భాగంగా ఒక్కో కంటెస్టెంట్‌ని దెయ్యాలు చంపుకుంటూ పోతే.. చనిపోయిన వారు దెయ్యాలుగా.. చంపిన వారు మనిషిగా మారుతూ ఆసక్తికరంగా ఈ దెయ్యాల ఆట ఆడారు. అయితే పునర్నవిని స్విమ్మింగ్ పూల్‌లో పడేస్తే ఆమె చనిపోతుందని.. తద్వారా శిల్ప మనిషిగా మారుతుందని బిగ్ బాస్ టాస్క్ ఇవ్వడంతో శిల్ప మిగతా దెయ్యాలతో కలిసి పునర్నవిని స్విమ్మింగ్ పూల్‌లోకి ఈడ్చిపాడేసింది. అయితే తనతో కటువుగా వ్యవహరిస్తూ ఈడ్చుకెళ్లి స్విమ్మింగ్ పూల్లో పడేయడాన్ని పునర్నవి తప్పు పట్టింది. ఇదేం గమే బిగ్ బాస్.. షిట్.. నీ ఆట నువ్వే ఆడుకో.. ఇలాంటి భయానకమైన చిత్ర హింసలు చేసే గేమ్ ఆడటం నా వల్ల కాదు అంటూ బిగ్ బాస్‌కే ఎదురు తిరిగింది.

మొత్తానికి నిన్నటి ఎపిసోడ్‌లో శ్రీముఖి, వరుణ్‌, పునర్నవి, మహేష్‌లు చనిపోయి దెయ్యాలుగా మారారు. అయితే దెయ్యాల చేతిలో చనిపోయిన వీరికి నేటి ఎపిసోడ్‌లో శిక్ష విధిస్తున్నాడు బిగ్ బాస్. వాళ్లకు బూట్లు ఇచ్చి పాలిష్ చేయాలని శిక్ష విధించాడు. దీంతో బిగ్ బాస్ నిర్ణయాన్ని పునర్నవి, మహేష్‌ వ్యతిరేకించారు. చెప్పులు కడగటం ఏంటి? షూ పాలిష్ చేయడం ఏంటి? ఇందుకా మేం బిగ్ బాస్ హౌస్‌కి వచ్చింది? అంటూ మహేష్ విట్టా సీరియస్ వార్నింగ్ ఇస్తుంటే.. పునర్నవి సైతం మేం చేయము.. ఏం చేసుకుంటారో చేసుకోండి. మమ్మల్ని ఇష్టం వచ్చినట్టు చేసి.. స్విమ్మింగ్ పూల్లో పడేసి ఈడ్చేస్తే ఇబ్బంది పడింది మేము. ఇప్పుడు మళ్లీ మాకు శిక్ష వేస్తారా? మేం ఎందుకు షూ పాలిష్ చేయాలి? నేను చేయను అంటూ బిగ్ బాస్‌పైన ఫైర్ అవుతోంది. అయితే శ్రీముఖి మాత్రం ఇదీ ఒక టాస్క్‌ అనుకుందామని వెళ్లి షూ పాలిష్ చేస్తుంది. మహేష్, పునర్నవికి మిగతా సభ్యులు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. మహేష్ కాస్త మెత్తబడినా పునర్నవి మాత్రం ససేమిరా అంటోంది. అలా అయితే తనను బిగ్‌బాస్‌ డైరెక్ట్‌గా నామినేట్ చేస్తాడని వారంత హెచ్చరించారు. అయినా సరే ఇంటికి వెళ్లిపోవడానికైనా రెడీ అంటోంది పునర్నవి. రేపటి ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో చూడాలి.