నేడు తెలంగాణ నేతలతో రాహుల్‌గాంధీ సమావేశం

తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ…పొత్తులు, అభ్యర్ధుల ఎంపిక, పార్టీలో చేరికల వ్యవహారంపై ఢిల్లీలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఈరోజు ప్రత్యేకంగా చర్చించనున్నారు. రాహుల్‌ పిలుపుతో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డితో పాటు దాదాపు 50మంది వరకు ఢిల్లీ తరలివెళ్లారు. ముందస్తు ఎన్నికల దృష్ట్యా… పార్టీ పరంగా వివిధ కార్యకలాపాలు నిర్వహణకు అవసరమైన నాలుగు రకాల కమిటీలతో పాటు మరో ఇద్దరు వర్కింగ్‌ ప్రసిడెంట్ల నియామకం కూడా జరగనుంది. నిజామాబాద్‌ మాజీ ఎమ్మెల్సీ భూపతిరెడ్డి.. రాహుల్‌ గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరనుండగా, టీఆర్‌ఎస్‌ రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్‌ తిరిగి కాంగ్రెస్‌ పార్టీలోకి రావాలని చేస్తున్న ప్రయత్నాలు కూడా రాహుల్‌ గాంధీ వద్ద చర్చకు వచ్చే అవకాశం ఉంది.

నాలుగు రాష్ట్రాలతో పాటు తెలంగాణ రాష్ట్ర ఎన్నికలు జరిగే అవకాశం ఉండడంతో కాంగ్రెస్‌ పార్టీ తన కార్యకలాపాలు వేగవంతం చేసింది. ఇప్పటికే రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో గెలుపు గుర్రాలపై ఉత్తమ్‌ ఆరా తీసి, సీనియర్లతో కలిసి చర్చించిన తరువాత జాబితా కూడా సిద్దం చేసినట్లు తెలుస్తోంది. ఈ జాబితాను వడపోత పోసి ఏఐసీసీ అధ్యక్షుడి ఆమోదముద్ర పడితేనే అభ్యర్ధుల ప్రకటనకు మార్గం సులువు కానుంది. రాబోయే మూడు నెలల్లో కాంగ్రెస్సే‌ అధికారంలోకి వస్తుందని ప్రచారం చేస్తున్న పార్టీ.. నియోజకవర్గాల వారీగా సుదీర్ఘంగా చర్చించి గెలుపునకు ఢోకా లేని వాళ్ల పేర్లనే తుదినిర్ణయంగా ప్రకటించాలని భావిస్తున్నారు.