పాకిస్థాన్‌లో మ్యూజియంగా ‘కపూర్‌’ నివాసం

బాలీవుడ్‌ నటుడు రిషి కపూర్‌ పూర్వీకుల నివాసాన్ని పాక్‌ ప్రభుత్వం మ్యూజియంగా మార్చనుంది. ఈ మేరకు ఆ దేశ విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషి ఓ ప్రకటన చేశారు. పాకిస్థాన్‌లో పెషావర్‌లోని ఫ్యాబుల్డ్ కిస్సా ఖ్వానీ బజార్‌లో ఉన్న ఈ నివాసాన్ని మ్యూజియంగా మార్చాలంటూ రిషి కపూర్‌ నుంచి అనేక అభ్యర్థనలు అందాయి. వాటిని పరిశీలించిన పాక్‌ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఖురేషి భారత పాత్రికేయులకు వెల్లడించారు.

‘రిషి కపూర్‌ ఈ ఇల్లు గురించి మాతో మాట్లాడారు. తన పూర్వీకుల నివాసాన్ని మ్యూజియంగా లేక ఏదైనా సంస్థగా కానీ మార్చాలని ఆయన కోరారు’ అని ఖురేషి వెల్లడించారు. ‘దాన్ని మ్యూజియంగా మార్చుతున్నట్లు ఆయనకు చెప్పండి’ అని విలేకరులతో అన్నారు. ‘పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ వారసత్వ ప్రదేశాలను పరిరక్షించే విషయంలో ప్రత్యేక దృష్టి సారించారు. రిషి కపూర్‌ అభ్యర్థనను ఆయన చాలా పాజిటివ్‌గా తీసుకున్నారు’ అని ఇమ్రాన్‌ స్పెషల్ అసిస్టెంట్ వెల్లడించారు.

‘కపూర్‌ హవేలీ’ గా పిలిచే ఆ నివాసాన్ని బసేశ్వర నాథ్ కపూర్‌ నిర్మించారు. ఆయన బాలీవుడ్‌ లెజెండ్ పృథ్విరాజ్‌ కపూర్‌ తండ్రి. పృథ్వి కుమారుడు, బాలీవుడ్ నటుడు రాజ్‌ కపూర్‌ కూడా అదే నివాసంలో జన్మించారు. రాజ్‌ కపూర్‌ కుమారుడే రిషి కపూర్‌. అయితే దేశ విభజన సమయంలో కపూర్ల కుటుంబం ఆ నివాసాన్ని వదిలి భారత్‌కు తరలివచ్చింది. తరవాత ఆ హవేలీ ఎంతో మంది చేతులు మారింది. కొద్ది సంవత్సరాల క్రితం నివాసంలోని పైభాగం కాస్త కూలిపోయినా, ఇంకా దానిలో 60 గదులు సురక్షితంగానే ఉన్నాయి.