పవర్ పై రజినీ వ్యాఖ్యలు!

సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయాల్లోకి వస్తారా..? అనే సందేహాలు చాలా మందిలో ఉన్నాయి. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కాలం చేసినప్పుడు కూడా ఆయన రాజకీయాల్లోకి వస్తారనే మాటలు వినిపించాయి. అయితే ఆయన నుండి మాత్రం ఎటువంటి సమాధానం లేదు. తాజాగా రజినీకాంత్ చెన్నైలోని పరమహంస యోగానంద రచించిన ‘ది డివైన్ రొమాన్స్’ అనే పుస్తకం తమిళ అనువాదం ‘దైవిక కాదల్’ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రజినీకాంత్ అధికారం గురించి కొన్ని వ్యాఖ్యలు చేశారు.
తనకు పవర్ అంటే ఇష్టమని కానీ అది అందరూ అనుకుంటున్న పవర్ కాదని అన్నారు. తనకు ఇష్టమైన పవర్ ఆధ్యాత్మికతకు సంబంధించిందని తెలిపారు. అంతేకాదు తనకు నటుడిగా అనిపించుకోవడం కంటే ఓ ఆధ్యాత్మిక వేత్తగా అనిపించుకోవడమే ఇష్టమని అన్నారు. ఎవరైనా వచ్చి తనకు డబ్బు కావాలా? పేరు కావాలా? ఆధ్యాత్మికఠ కావాలా? అని ప్రశ్నిస్తే ఆధ్యాత్మికతనే కోరుకుంటానని అన్నారు. ఈ వ్యాఖ్యలు మరోసారి ఆయనకు దైవం పట్ల ఉన్న గౌరవాన్ని, అభిమానాన్ని తెలియజేశాయి.