అమెరికాకు రజనీ

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ కుటుంబసభ్యులతో కలిసి విశ్రాంతి కోసం అమెరికాకు పయనమయ్యారు. రజనీకాంత్‌ జీవన శైలి గురించి అందరికీ తెలిసిందే. ఆయన తాను నటించిన చిత్రం పూర్తి కాగానే విశ్రాంతి కోసం తప్పనిసరిగా విదేశాలకు వెళుతుంటారు. ఈ సారి ఆయన కుటుంబ సమేతంగా అమెరికాకు వెళ్లారు. రజనీకాంత్‌ నటించిన 2.ఓ చిత్రం గత నెల 29వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన విషయం తెలిసిందే.

ఆ చిత్ర షూటింగ్‌ పూర్తి అయిన సమయంలోనూ ఆయన విశ్రాంతి కోసం విదేశాలకు వెళ్లారు. తాజాగా పేట చిత్రాన్ని పూర్తి చేశారు. ఈ చిత్రం జనవరిలో సంక్రాంతికి తెరపైకి రానుంది. దీంతో రజనీకాంత్‌ విశ్రాంతి కోసం కుటుంబసభ్యులతో సహా శనివారం సాయంత్రం చెన్నై నుంచి బయలుదేరి అమెరికాకు పయనం అయ్యారు. అక్కడ 10 రోజులు ప్రశాంతంగా గడిపి జనవరి తొలి వారంలో చెన్నైకి తిరిగిరానున్నారు.

రజనీ రాజకీయాల్లోకి రానున్నట్లు గత ఏడాది డిసెంబర్‌లో బహిరంగంగా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఏడాది గడుస్తున్నా ఇంకా పార్టీ పేరును కూడా వెల్లడించని పరిస్థితి. దీంతో ఈ నెలలో రజనీకాంత్‌ పార్టీని ప్రకటిస్తారని ఆశించిన ఆయన అభిమానులు తీవ్ర అసంతృప్తికి గురవుతున్నారు. కొత్త సంవత్సం ప్రథమార్థంలోనైనా ప్రకటిస్తారనే ఆశాభావంతో ఉన్నారు. అయితే రజనీకాంత్‌ ఏఆర్‌.మురుగదాస్‌ దర్శకత్వంలో నటించడానికి పచ్చజెండా ఊపారనే ప్రచారం జరుగుతుండడంతో ఆయన అమెరికా నుంచి రాగానే ఆ చిత్ర షూటింగ్‌కు సిద్ధం అవుతారనే వార్త వినిపిస్తోంది.