టాలీవుడ్‌ హీరోలపై రకుల్‌ సింగ్‌ వ్యాఖ్యలు

సినిమా కథలో హీరోకు అధిక ప్రాధాన్యం ఇవ్వడం లాంటివి టాలీవుడ్‌లో లేవని హీరోయిన్‌ రకుల్‌ప్రీత్‌ సింగ్‌ అన్నారు. ఆమె హిందీలో నటించిన సినిమా ‘దే దే ప్యార్‌ దే’. అజయ్‌ దేవగణ్‌ హీరో. టబు మరో హీరోయిన్‌గా నటించారు. మంగళవారం ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. ఇందులో రకుల్‌ 50 ఏళ్ల వ్యక్తికి ప్రేయసిగా కనిపించారు. మే 17న ఈ చిత్రం ప్రేక్షకుల ముందకు రాబోతోంది. ఈ సినిమా ప్రచారంలో భాగంగా రకుల్‌ ఓ ఆంగ్లపత్రికతో మాట్లాడారు. విలేకర్లు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు.

తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారా? అని అడగగా.. ‘ప్రపంచం మొత్తం పురుషాధిక్యత ఉందని అనుకోకండి. టాలీవుడ్‌లో సినిమాలపరంగా హీరోలకు అధిక ప్రాధాన్యం ఇస్తారని నాకు ఎప్పుడూ అనిపించలేదు. కాలం మారుతోంది, ఎన్నో మంచి సినిమాలు వస్తున్నాయి. ‘బాహుబలి’ ఓ పెద్ద సినిమా. అందులోని కథ మొత్తం అనుష్క చుట్టూ తిరుగుతుంది. ఆమె పాత్రను ఎంతో బలంగా రచించారు’ అని ఆమె అన్నారు.

టాలీవుడ్‌ హీరోలతో కలిసి పనిచేయడం గురించి రకుల్‌ మాట్లాడుతూ.. ‘తెలుగులో ఎంతో మంది అద్భుతమైన వ్యక్తులు ఉన్నారు. చరణ్‌, బన్నీ, రవితేజ.. ఎంతో మంచి వారు. వారంతా గొప్ప డ్యాన్సర్లు. మీకు శరీరంలో ఎముకలు లేవా?అని వారితో జోక్‌ చేస్తుంటా. వారంతా ఎంతో సామాన్యంగా ఉంటారు కాబట్టే అంతటి స్టార్‌డమ్‌ వచ్చింది’ అని పేర్కొన్నారు.

నటీమణుల గురించి ప్రశ్నించగా.. ‘నయనతార, త్రిష, కంగన రనౌత్‌, దీపికా పదుకొణె, ఆలియా భట్‌ పరిశ్రమలో ఎంతో గొప్పగా రాణిస్తున్నారు. భారత చిత్ర పరిశ్రమలో ఎన్నో మార్పులు వచ్చాయి. మహిళల కోసం మంచి పాత్రలు రాస్తున్నారు. కానీ ఇంకా పురుషాధిక్యత కనిపిస్తోంది. గతంతో పోలిస్తే ఇప్పుడు పరిస్థితులు మెరుగయ్యాయి’ అని ఆమె చెప్పారు.

CLICK HERE!! For the aha Latest Updates