గుర్రంపై రామ్‌చరణ్‌.. ‘వినయ విధేయ రామ’ న్యూ పోస్టర్‌

యంగ్‌ హీరో రామ్‌చరణ్‌ నటిస్తున్న చిత్రం ‘వినయ విధేయ రామ’. ఈ సినిమాకి బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్నారు. కైరా అద్వాణీ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై దానయ్య నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. బాలీవుడ్‌ నటుడు వివేక్‌ ఒబెరాయ్‌ విలన్‌ పాత్రలో నటిస్తున్నారు. ప్రశాంత్‌, ఆర్యన్‌ రాజేశ్‌, స్నేహ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవల విడుదలైన రెండు పాటలు, టీజర్‌కు మంచి స్పందన లభించింది. సంక్రాంతికి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఈ సినిమా ట్రైలర్‌ను గురువారం ఉదయం 9 గంటలకు విడుదల చేయబోతున్నారు. దీంతోపాటు జూక్‌బాక్స్‌ను కూడా విడుదల చేయనున్నట్లు మూవీ యూనిట్‌ ప్రకటించింది. ఈ నేపథ్యంలో తాజాగా కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో చరణ్‌ పవర్‌ఫుల్‌గా కనిపించారు. ఆయన విలన్లతో పోరాడడానికి గుర్రంపై వెళ్తూ కనిపించారు.

ఈ పోస్టర్‌ను చూసిన రానా, అల్లు శిరీష్‌ ట్వీట్లు చేశారు. ‘ఇది చూడటానికి చాలా అద్భుతంగా ఉంది’ అని రానా అన్నారు. ‘ఎంత అద్భుతమైన పోస్టర్‌. చాలా నచ్చింది. ‘వినయ విధేయ రామ’ కోసం చక్కటి ఎపిసోడ్‌లను తీశారని చిత్ర బృందం ద్వారా విన్నాను. వాటిని స్క్రీన్‌పై చూసేందుకు ఎదురుచూస్తున్నా. సినిమాకు ది బెస్ట్‌ ఇవ్వాలని దర్శక, నిర్మాతలు రామ్‌చరణ్‌ కోసం గుర్రాన్ని నెదర్లాండ్స్‌‌ నుంచి తెప్పించారు’ అని అల్లు శిరీష్‌ ట్వీట్‌ చేశారు.