భక్తుడిగా మారిన ఆర్జీవీ

నాస్తికుడైన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ ఒక్కసారిగా భక్తుడిగా మారిపోయారు. హేతువాద దృక్పథంతో తనదైన విలక్షణ శైలిని ఎప్పటికప్పుడు చాటుకునే వర్మ దైవదర్శనం చేసుకొని అభిమానులను ఆశ్చర్యానికి గురిచేశారు. కొంతమంది బంధువులతో కలిసి ఆయన చిత్తూరు జిల్లాలోని కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయకుడిని దర్శించుకున్నారు.

ఆలయ సిబ్బంది ఆయనకు పూలమాలలు వేసి ఆహ్వానం పలకగా.. వర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేదపండితులు మంత్రోచ్ఛారణలతో వర్మ కుటుంబ సభ్యులను ఆశీర్వదించారు. ఆలయ నిర్వాహకులు వినాయకుడి చిత్రపటం, ప్రసాదం అందజేశారు. అనంతరం సాధారణ భక్తుల తరహాలోనే ఆలయంలో కలియతిరుగుతూ వర్మ దైవదర్శనం చేసుకున్నారు.