‘ప్రణయ్‌’ హత్య కేసుపై రామ్‌గోపాల్‌ వర్మ ట్వీట్‌

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘ప్రణయ్‌’ హత్య కేసుపై ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ స్పందించారు. అమృత తండ్రి మారుతీరావు నేరస్థుడని అన్నారు. కుమార్తె తక్కువ కులం వ్యక్తిని పెళ్లి చేసుకుందని పగబట్టిన మారుతీరావు తన అల్లుడు ప్రణయ్‌ని అతి కిరాతకంగా హతమార్చడాని. వారం రోజుల క్రితం జరిగిన ఈ దారుణ ఘటనపై ఇప్పటికే టాలీవుడ్‌ హీరోలు రామ్‌చరణ్‌, మంచు మనోజ్‌ తదితరులు ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఓ వ్యక్తిని హత్య చేయడంలో పరువు ఉందా?’ అని ప్రశ్నించారు.

ఈ ఘటనపై వర్మ శుక్రవారం ట్వీట్‌ చేశారు. ‘అమృత తండ్రి మారుతీరావు క్రూరమైన క్రిమినల్‌. ప్రణయ్‌ను చంపడం అతడికి గౌరవమా?.. ఒకవేళ ఇది పరువు హత్య అయితే ఆయన కూడా చావడానికి సిద్ధంగా ఉండాలి. నిజమైన పరువు హత్య ఏంటంటే.. పరువు పేరుతో హత్యలు చేసే వారిని హత్య చేయడమే’ అని వర్మ పేర్కొన్నారు.

ప్రణయ్‌ కేసు నిందితులను పోలీసులు గురువారం కస్టడీకి రావల్సిందిగా ఆదేశించారు. తిరునగరు మారుతీరావు (ఏ1), అస్ఘర్‌ అలీ(ఏ3), అబ్దుల్‌ బారీ (ఏ4) లను మరోసారి విచారించనున్నారు. వీరితో పాటు హంతకుడిగా భావిస్తున్న సుభాష్‌శర్మనూ శుక్రవారం కస్టడీకి తీసుకోనున్నారు.