ఆడియన్స్‌ పైకి దూకిన హీరో.. నెటిజన్ల మండిపాటు

బాలీవుడ్‌ హీరో రణ్‌వీర్‌ సింగ్‌ ఎప్పుడూ ఎంతో ఉత్సాహంగా కనిపిస్తుంటారు. ఆయన్ను చూసి అభిమానులు సంబరపడుతుంటారు. అయితే ఈసారి రణ్‌వీర్‌ తన అత్యుత్సాహం వల్ల నెటిజన్ల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నారు. రణ్‌వీర్‌ హీరోగా నటించిన చిత్రం ‘గల్లీబాయ్’. ఈ చిత్రంలో ఆలియా భట్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. జోయా అక్తర్‌ ఈసినిమాకి దర్శకత్వం వహించారు. ఇందులో రణ్‌వీర్‌ పాపులర్‌ గాయకుడు కావాలని కలలు కనే ‘గల్లీబాయ్’‌గా కనిపించబోతున్నారు. ప్రేమికుల రోజు సందర్భంగా ఫిబ్రవరి 14న ఈ సినిమా విడుదల కాబోతోంది.

ఈ నేపథ్యంలో ప్రచార కార్యక్రమాలు జోరుగా జరుగుతున్నాయి. రెండు రోజుల క్రితం ముంబయిలో జరిగిన లాక్మే ఫ్యాషన్‌ వీక్ ఫైనల్‌‌లో రణ్‌వీర్‌ ప్రదర్శన ఇచ్చారు. స్టేజ్‌పై పాట పాడుతూ.. ఆడియన్స్‌ను సర్‌ప్రైజ్‌ చేయాలని ఒక్కసారిగా వేదికపై నుంచి వారిపైకి దూకారు. ఈ క్రమంలో కొందరు మహిళలు గాయపడ్డట్లు తెలుస్తోంది. వేడుకలో భాగంగా తీసిన ఫొటోల్లో ఈ విషయం స్పష్టంగా తెలుస్తోంది. రణ్‌వీర్‌ ఒక్కసారిగా దూకడంతో నిలువరించుకోలేకపోయిన మహిళలు కిందపడ్డట్లు కనిపిస్తోంది.

దీంతో రణ్‌వీర్‌పై పలువురు నెటిజన్లు మండిపడ్డారు. ‘రణ్‌వీర్‌ చిన్నపిల్లల వేషాలు ఇక ఆపు, ఆలోచించి ప్రవర్తించు రణ్‌వీర్‌, నీ వల్ల కొందరు గాయపడ్డారు..’ అంటూ కామెంట్లు చేశారు. ఇలా రణ్‌వీర్‌ ఆడియన్స్‌పైకి దూకడం ఇది తొలిసారి కాదు. ఆయన ఇటీవల ‘గల్లీబాయ్‌’ ఆడియో విడుదల వేడుకలోనూ ఇలానే చేశారు.

CLICK HERE!! For the aha Latest Updates