బోయపాటి శిష్యుడితో ‘ఆర్ఎక్స్ 100’ హీరో కొత్త చిత్రం ప్రారంభం

‘ఆర్ఎక్స్ 100’ సినిమాతో ఘన విజయాన్ని అందుకున్న యంగ్‌ హీరో కార్తికేయ నటిస్తున్న కొత్త చిత్రం హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభమైంది. ప్రముఖ దర్శకుడు బోయపాటి శీను వద్ద 12 ఏళ్లపాటు సహాయ దర్శకుడిగా పనిచేసిన అర్జున్ జంధ్యాల ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. అనిల్‌ కడియాల, తిరుమల్‌ రెడ్డి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. జ్ఞాపిక ఎంటర్‌టైన్‌మెంట్స్, స్ప్రింట్‌ టెలీ ఫిలిమ్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమా ప్రారంభోత్సవానికి ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, దర్శకుడు బోయపాటి శీను ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. ‘అనిల్‌ కడియాల, ప్రవీణ కడియాల జంట నాకు టీవీ రంగం ద్వారా ఎప్పటి నుంచో సుపరిచితులు. నేను ఏ సినిమా ప్రారంభోత్సవానికి వెళ్లను. అలాంటిది ఈ జంట ఎంతో కష్టపడి ఇంతదూరం ప్రయాణం చేశారు. అందుకే మనసారా ఆశీర్వదించాలని వచ్చా’ అన్నారు. బోయపాటి మాట్లాడుతూ ‘నాకు అర్జున్‌ తమ్ముడు లాంటివాడు. పన్నెండేళ్లు నా దగ్గర పనిచేశాడు. టాలెంట్, టైమింగ్‌ ఉన్నవాడు. ఈ చిత్ర బృందానికి మంచి పేరు వస్తుంది’ అని చెప్పారు. ‘ఆర్‌ఎక్స్‌ 100′ తర్వాత చాలా కథలు విన్నా. కథ నచ్చింది. షూటింగ్‌ ఎప్పుడు ప్రారంభమవుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’ అని కార్తికేయ అన్నారు. ‘బోయపాటి పేరు ఎక్కడా తగ్గకుండా ఈ సినిమా తీస్తా.’ అన్నారు అర్జున్‌ జంధ్యాల. నిర్మాత అనిల్‌ మాట్లాడుతూ ‘బుల్లితెరలాగానే వెండితెరపై కూడా తమను ఆదర్శిస్తారని ఆశిస్తున్నా’ అని అన్నారు. కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య, మిరియాల రవీందర్‌రెడ్డి, ప్రవీణ్, నటులు హేమ తదితరులు పాల్గొన్నారు.

https://www.youtube.com/watch?v=4oVDR1kMCWU