ప్రభాస్‌ ‘సాహో’ సంగీత దర్శకుడు అతనే!

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ నటిస్తున్న ‘సాహో’ చిత్రం నుంచి సంగీత త్రయం శంకర్‌-ఎహసాన్‌-లాయ్‌ వైదొలిగిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వీరి స్థానాన్ని జిబ్రాన్‌ భర్తీ చేయనున్నారు. ఈ సినిమాకు ఆయన సంగీతం అందించనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ఆదివారం ప్రకటించింది. ‘రన్ రాజా రన్’, ‘విశ్వరూపం’, ‘జిల్’ వంటి చిత్రాలకు జిబ్రాన్ సంగీతం అందించారు. ‘సాహో చాప్టర్ 2’కి కూడా ఆయనే నేపథ్య సంగీతం అందించారు.

‘సాహో’ సినిమాకు సుజీత్‌ దర్శకత్వం వహిస్తున్నారు. బాలీవుడ్‌ నటి శ్రద్ధా కపూర్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. నీల్‌ నితిన్‌ ముకేష్‌, వెన్నెల కిశోర్‌, మురళీ శర్మ, జాకీ ష్రాఫ్‌, అరుణ్‌ విజయ్‌, మందిరా బేడీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. దాదాపు రూ.300 కోట్ల బడ్జెట్‌తో యూవీ క్రియేషన్స్‌ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఇటీవల విడుదల చేసిన ఈ సినిమా టీజర్‌ రికార్డు స్థాయిలో వ్యూస్‌ను సొంతం చేసుకుంది. ఆగస్టు 15న సినిమా విడుదల కాబోతోంది.