నయనతార తర్వాతి సినిమా టికెట్లు మీకు కొనిస్తాం… రాధారవికి సమంత కౌంటర్‌

లేడీ సూపర్‌స్టార్‌ నయనతారపై వ్యంగ్య వ్యాఖ్యలు చేసిన తమిళ నటుడు రాధా రవికి సమంత తనదైన శైలిలో కౌంటర్‌ వేశారు. ‘మిస్టర్‌ రాధా రవి.. కష్టమనేది ఎప్పటికీ అలాగే నిలిచిపోతుంది. మీరు చాలా బాధపడుతున్న వ్యక్తి. అందుకు మిమ్మల్ని చూస్తుంటే మాకు బాధేస్తోంది. మీకు ప్రశాంతత లభించాలని కోరుకుంటున్నాం. నయనతార తర్వాతి సూపర్‌హిట్‌ సినిమా టికెట్లు మీకు కొనిస్తాం. పాప్‌కార్న్‌ తింటూ ఆస్వాదించండి’ అని రాధారవిని ఉద్దేశిస్తూ ట్వీట్‌ చేశారు. ఈ ట్వీట్‌కు అభిమానుల నుంచి కూడా మంచి స్పందన వస్తోంది. ‘బాగా చెప్పావ్‌ సమంత..’ అంటూ నెటిజన్లు ఆమెను అభినందిస్తున్నారు. ఆడవారిపై, నటీమణులపై అసభ్యకర వ్యాఖ్యలు చేసేవారికి సమంత ఎప్పటికప్పుడు సమాజిక మాధ్యమాల ద్వారా బుద్ధి చెప్పేందుకు యత్నిస్తుంటారు. ఇప్పటికే రాధారవికి నడిగర్‌ సంఘం నోటీసులు పంపింది. ఆయన్ను ఇక నుంచి సినిమాల్లోకి తీసుకోబోమని ఓ నిర్మాణ సంస్థ ప్రకటించింది. నయన్‌ కూడా తన అభిప్రాయాన్ని వెల్లిడిస్తూ ఆయనకు గుణపాఠం చెప్పారు.