పెళ్లి తర్వాత నా కోపాన్ని అదుపులో పెట్టుకోగలుగుతున్నా: సమంత

నాగచైతన్యతో ప్రేమ, పెళ్లి.. ఇలా అన్నీ కుదరడానికి దాదాపు ఎనిమిదేళ్లు పట్టిందని హీరోయిన్‌ సమంత అన్నారు. ఆమె తాజాగా ఓ ఆంగ్లపత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా తన వ్యక్తిగత జీవితం గురించి ముచ్చటించారు. మా ఇద్దరి అభిప్రాయాలు, ఆలోచనల పరంగా ఒక్కటి కావడానికి ఎనిమిదేళ్లు పట్టిందని సమంత అన్నారు. ఎందుకంటే నేను చైతన్యను బాగా ఇష్టపడిన సమయంలో ఆయనకు నాపై ఆ భావన లేదు. మా ఇద్దరి అభిప్రాయాలు కలిసిన సమయంలో ఇతర కారణాల వల్ల కాస్త దూరంగా ఉన్నాం. ఇలా మేం ఇద్దరం కలవడానికి ఎక్కువ రోజులు పట్టింది అన్నారు. పెళ్లి తర్వాత నా కోపాన్ని అదుపులో పెట్టుకోగలుగుతున్నా. నాకు, చైతన్యకు మధ్య ఎంత పెద్ద గొడవ జరిగినప్పటికీ.. ఒకరి పక్కన ఒకరం కూర్చుంటాం, మాట్లాడుకుంటాం. మాకు గొడవ జరిగిందని మమ్మల్ని చూసే వారికి కూడా తెలియదు.. అలా ఉంటాం. కానీ ఎప్పుడూ హద్దు మీరలేదు అని సమంత అన్నారు.

అనంతరం తల్లి కావడం గురించి మాట్లాడుతూ.. “నాకు బిడ్డ పుడితే తనే నా ప్రపంచం అవుతుంది. పనిచేసే తల్లులంటే నాకు చాలా గౌరవం. నా బాల్యం అంత సజావుగా గడవలేదు. ఇలాంటి కోవకు చెందిన వారిని ఎవరిని ప్రశ్నించినా.. నేను పొందలేని దాన్ని నాకు పుట్టబోయే బిడ్డకు ఇవ్వాలి అనుకుంటున్నా అనే చెబుతారు. కాబట్టి నాకు బిడ్డ పుట్టిన కొన్నేళ్లు మాత్రం అన్నింటికీ దూరంగా ఉంటా. ఆ బిడ్డే నా సర్వస్వం అవుతుంది అని సమంత చెప్పారు. బాల్యంలో పాకెట్‌ మనీ కోసం..
పదకొండో తరగతి చదువుతున్నప్పుడు పాకెట్‌ మనీ కోసం చిన్న చిన్న పనులు చేసేవాళ్లమని ఈ సందర్భంగా సమంత గుర్తు చేసుకున్నారు. ‘పదకొండో తరగతిలో నేను, నా స్నేహితులు పాకెట్‌ మనీ కోసం జాబ్‌ చేసేవాళ్లం. అప్పట్లో కొన్ని కంపెనీలు కార్యక్రమాలు ఏర్పాటు చేసేవాళ్లు. అక్కడ రిసెప్షన్‌ కమిటీలో మేం పనిచేసేవాళ్లం. కార్యక్రమానికి వచ్చే ప్రజల దగ్గర సమాచారం తీసుకుని దరఖాస్తులో రాసేవాళ్లం. అదీ ఓ రకమైన అనుభవం’ అని ఆమె గుర్తు చేసుకున్నారు.