‘నా చిన్న తమ్ముడు పెద్దవాడైపోయాడు’: షారుక్‌

బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ షారుక్‌ ఖాన్.. నటుడు రితేశ్‌ దేశ్‌ముఖ్‌కు ధన్యవాదాలు తెలిపారు . షారుక్‌ హీరోరగా నటించిన సినిమా ‘జీరో’. ఆనంద్‌ ఎల్‌ రాయ్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. కత్రినా కైఫ్‌, అనుష్క శర్మ హీరోయిన్లుగా నటించారు. డిసెంబర్‌ 21 క్రిస్మస్‌ సందర్భంగా ఈసినిమాని ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే రితేశ్‌ దేశ్‌ముఖ్‌ నటించిన మరాఠీ చిత్రం ‘మౌలీ’ కూడా డిసెంబర్ 21నే విడుదల కావాల్సి ఉంది. దాంతో ‘మౌలీ’ సినిమా విడుదల తేదీని వాయిదా వేసుకోవాల్సిందిగా షారుక్‌ రితేశ్‌ను కోరారు.

ఇందుకు రితేశ్‌ కూడా ఒప్పుకొని సినిమాను కొన్ని వారాల పాటు వాయిదా వేశారు. దాంతో షారుక్‌ ట్విటర్‌ వేదికగా రితేశ్‌కు ధన్యవాదాలు తెలిపారు. ‘నా చిన్న తమ్ముడు పెద్దవాడైపోయాడు.. బేబీ(రితేశ్‌) నీకు నా పట్ల ఉన్న ప్రేమాభిమానాలకు, నీ పెద్ద మనసుకు ధన్యవాదాలు. చాలా గొప్పగా ఫీలవుతున్నాను. నా ఆత్మాభిమానాన్ని కాపాడటం కోసం తన అవసరాన్ని పక్కనబెట్టే స్నేహితుడిని సాయం చేయమని అడిగినందుకు సంతోషంగా ఉంది’ అని షారుక్‌ ట్వీట్‌లో పేర్కొన్నారు.

రితేశ్‌కు బాలీవుడ్‌లో సోలో హిట్స్‌ ఎక్కువగా లేవు. 2014లో వచ్చిన ‘లాల్‌ భారీ’ అనే మరాఠీ చిత్రంతో బ్లాక్‌ బస్టర్‌ విజయం అందుకున్న రితేశ్‌ ఇప్పుడు ‘మౌలీ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ చిత్రంతో పాటు ‘హౌస్‌ఫుల్‌ 4’, ‘టోటల్‌ ధమాల్‌’ చిత్రాల్లోనూ రితేశ్‌ నటిస్తున్నారు.