వారిద్దరూ.. బ్రేకప్‌ చెప్పేసుకున్నారు!

హీరోయిన్ శృతి హాసన్‌.. కొంతకాలంగా లండన్‌కు చెందిన థియేటర్‌ ఆర్టిస్ట్‌ మైఖెల్‌ కోర్సేల్‌తో ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు వారిద్దరూ ఒకరికొకరు బ్రేకప్‌ చెప్పేసుకున్నారు. ఈ విషయాన్ని మైఖెల్‌ ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా స్పష్టం చేశారు. ‘జీవితం మమ్మల్నిద్దరినీ వ్యతిరేక మార్గాల్లో ఉంచింది. దురదృష్టవశాత్తు మేమిద్దరం ఒంటరి మార్గాల్లో నడవాల్సి వస్తోంది. కానీ ఈ యంగ్‌ లేడీ ఎప్పటికీ నా బెస్ట్‌ ఫ్రెండ్‌గానే మిగిలిపోతుంది. ఆమెకు జీవితాంతం ఓ స్నేహితుడిగా ఉండిపోతున్నందుకు చాలా గొప్పగా ఫీలవుతున్నాను’ అని పేర్కొంటూ శృతితో కలిసి దిగిన ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. అయితే ఇద్దరి మధ్య ఎలాంటి గొడవలు లేవని, పరస్పరం చర్చించుకుని స్నేహపూర్వకంగానే విడిపోయారని సన్నిహిత వర్గాలు మీడియా ద్వారా వెల్లడించాయి.

2016లో శృతి ఓ కాన్సర్ట్‌ నిమిత్తం లండన్‌ వెళ్లినప్పుడు అక్కడ ఓ కామన్‌ ఫ్రెండ్‌ ద్వారా మైఖెల్‌ను కలిశారు. ఆ తర్వాత ఇద్దరి మధ్య మొదలైన స్నేహం ప్రేమగా మారింది. శ్రుతి నెలకోసారైనా మైఖెల్‌ కోసం లండన్‌ వెళ్లి వస్తుండేవారట. శృతి ఇంట్లో జరిగే శుభకార్యాలకు మైఖెల్‌ కూడా హాజరవుతుండేవారు. మైఖెల్‌.. శృతి తల్లిదండ్రులను కూడా కలిశారు. కమల్‌ హాసన్‌ నటించిన ‘విశ్వరూపం 2’ చిత్రంలో మైఖెల్‌ రష్యన్‌ సోల్జర్‌ పాత్రలో నటించారు.