మీటూ ఆరోపణలపై స్పందించిన సింగర్‌ కార్తిక్

ప్రముఖ సింగర్‌ కార్తిక్‌ తనను లైంగికంగా వేధించాడంటూ గతేడాది ఓ యువతి ఆరోపించారు. తన గురించి తెలీకుండా ఈ విషయాన్ని బయటపెట్టాల్సిందిగా గాయని చిన్మయి శ్రీపాద సాయం కోరారు. దాంతో కార్తిక్‌ సదరు యువతికి చేసిన మెసేజ్‌ల స్క్రీన్‌షాట్లను చిన్మయి ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. ఈ విషయం బయటికొచ్చిన మూడు నెలల తర్వాత కార్తిక్‌ తనపై వస్తున్న ఆరోపణలపై స్పందించారు. ఈ విషయాన్ని ఉద్దేశిస్తూ ట్విటర్‌లో ఓ పోస్ట్ పెట్టారు.

‘కొంతకాలం పాటు నేను సోషల్‌మీడియాకు దూరంగా ఉన్నాను. ముందుగా పుల్వామా ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన సీఆర్‌పీఎఫ్‌ జవాన్ల కుటుంబాలకు నా సంతాపం తెలియజేయాలనుకుంటున్నాను. ఇతర కారణాల వల్ల గత కొన్ని నెలలుగా నేను చాలా ఇబ్బందిపడుతున్నాను. నేను, నా చుట్టూ ఉన్న వారు సంతోషంగా ఉండాలన్న ఉద్దేశంతో ఇప్పుడు మీ ముందుకొచ్చాను. నాపై ఎవరెవరో సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. నాకు తెలిసినంతవరకు ఉద్దేశపూర్వకంగా నేను ఎవ్వర్నీ కించపరచలేదు. ఒకవేళ నా వల్ల ఇబ్బంది కలిగి ఉంటే నేరుగా నన్నే వచ్చి కలవండి. మీటూ పేరుతో ఆరోపణలు చేస్తున్న వారి వైపు నిజం ఉంటే వారికి నా పూర్తి మద్దతునిస్తాను. ఒకవేళ నా తప్పు ఉంటే క్షమాపణ అడుగుతాను. చట్టపరమైన చర్యలను ఎదుర్కోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. విషయం ఇంతదాకా వచ్చింది కాబట్టి మీకు మరో విషయం చెప్పాలనుకుంటున్నాను. మా నాన్న గత కొన్ని నెలలుగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. కాబట్టి ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థించాల్సిందిగా నా స్నేహితులు, శ్రేయోభిలాషులను కోరుకుంటున్నాను. ఆయన విషయంలో నేను పని పైన దృష్టిపెట్టలేకపోతున్నాను.’ అని పేర్కొన్నారు. ‘దేవదాస్‌’, ‘ఆర్‌ఎక్స్‌ 100’, ‘పంతం’, ‘విజేత’, ‘ఎంసీఏ’, ‘సింగం3’ తదితర చిత్రాల్లోని పాటలకు కార్తిక్‌ తన గాత్రాన్ని అందించారు.