ఇకపై నటుడిగానే సినిమాలు చేస్తా!

కోలీవుడ్ దర్శకుడు ఎస్.జె.సూర్య గతంలో ‘వాలి’,’ఖుషీ’ వంటి సినిమాలను రూపొందించాడు. అవి మంచి విజయాలను అందుకున్నాయి. అయితే ఆ తరువాత ఆయన డైరెక్ట్ చేసిన ఏ సినిమా కూడా ఆ స్థాయి విజయాలను అందుకోలేకపోయాయి. దీంతో దర్శకుడిగా సినిమాలు చేయడం పక్కన పెట్టి నటుడిగా తన సత్తా చాటాలని ప్రయత్నాలు మొదలు పెట్టాడు. ఆ మధ్య తమిళంలో ‘ఇరైవి’ అనే సినిమాలో నటుడిగా తన స్టామినాను చాటి చెప్పాడు. అప్పటినుండి కూడా పూర్తిగా నటన మీదే దృష్టి పెట్టాడు ఎస్.జె.సూర్య. ప్రస్తుతం ఆయన ‘స్పైడర్’ సినిమాలో విలన్ గా నటించాడు. ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో విడుదలకు సిద్ధంగా ఉంది.

అలానే విజయ్ నటిస్తోన్న ‘మెర్సల్’ సినిమాలో కూడా సూర్య విలన్ గా కనిపిస్తున్నాడు. ఆ సినిమా కూడా తెలుగులో విడుదల కాబోతుంది. ఈ సంధర్భంగా మాట్లాడిన ఎస్.జె.సూర్య.. ఇకపై డైరెక్టర్ గా సినిమాలు చేయాలనుకోవడం లేదని స్పష్టం చేశాడు. నటుడిని కావాలనే తాను ఇండస్ట్రీకు వచ్చానని, కొన్ని పరిస్థితుల్లో దర్శకుడిగా మారానని అన్నాడు. దర్శకుడిగా సినిమాలు చేసిన తరువాతే నటుడిగా అవకాశాలు వచ్చాయని, ఇప్పుడు తనలోని దర్శకుడికి విశ్రాంతి ఇచ్చి నటుడిగా ముందుకు వెళ్లాలనుకుంటున్నట్లు వెల్లడించాడు.