తిరిగి సెట్స్‌లో సోనాలి..!

ప్రముఖ నటి సోనాలి బింద్రే చాలా కాలం తర్వాత తిరిగి సెట్స్‌లోకి అడుగుపెట్టారు. కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న సోనాలి.. న్యూయార్క్‌లో చికిత్స చేయించుకుని ఇటీవల ముంబయి చేరుకున్నారు. అయితే ఈరోజే సోనాలి తన పనిని తిరిగి ప్రారంభించారట. చాలా కాలం తర్వాత సెట్‌లోకి అడుగుపెట్టినట్లు వెల్లడిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటోను పోస్ట్‌ చేశారు. ‘చాలా కాలం తర్వాత సెట్స్‌లోకి అడుగుపెట్టాను. ఇదో కలలా ఉంది. మళ్లీ పనిలోకి అడుగుపెట్టినప్పుడు, కెమెరా ముందు నిలబడినప్పుడు కలిగే ఆ ఫీలింగ్‌ను చెప్పడానికి మాటలు సరిపోవు’ అని సోనాలి వెల్లడించారు.

అయితే ఆమె ప్రస్తుతం ఏ ప్రాజెక్ట్ నటిస్తున్నారన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. ఇదివరకు సోనాలి ‘ఇండియాస్‌ బెస్ట్‌ డ్రామేబాజ్‌’ అనే హిందీ టీవీ షోకు న్యాయనిర్ణేతగా వ్యవహరించేవారు. తనకు క్యాన్సర్‌ అని తెలీగానే ఈ షో నుంచి తప్పుకొన్నారు. త్వరలో రెండో విడత చికిత్స నిమిత్తం సోనాలి మళ్లీ న్యూయార్క్‌ వెళతారు.